కొబ్బరి పీచు, ఎండుగడ్డి..  ముస్తాబైనయ్​!

కొబ్బరి పీచు, ఎండుగడ్డి..  ముస్తాబైనయ్​!

చెట్ల వేర్లు, ఆకులు, కొబ్బరి పీచు, ఎండుగడ్డి, గింజలు, కూరగాయల వేస్ట్​తో బొమ్మలు చేస్తున్న ఉమాపతి సొంతూరు పుదుచ్చేరిలోని సెలియమేడు. వాళ్ల నాన్న గవర్నమెంట్​ స్కూల్​ టీచర్​. చేనేత పనిపైన ప్రాణం పెట్టేవాడు ఆయన. రోజూ స్కూల్​ నుంచి రాగానే..నేరుగా  మగ్గం మీదనే కూర్చునేవాడు. అది చూసి రంగులు, డిజైన్ల మీద తెలియని ఇష్టం మొదలైంది ఉమాపతికి కూడా. దాంతో పదో క్లాస్​ పూర్తవగానే బ్యాచిలర్​ ఆఫ్​ ఫైన్​ ఆర్ట్స్​లో చేరాడు. శిల్పాల తయారీకి సంబంధించి మాస్టర్స్ కూడా చేశాడు. ఆ వెంటనే 2010 లో  గవర్నమెంట్​ హై స్కూల్​లో ఆర్ట్​​​ టీచర్​గా ఉద్యోగం వచ్చింది. 

డబ్బు లేకపోవడంతో.. 
మొదటి రోజు నుంచి.. స్టూడెంట్స్​కి ఆర్ట్​​ని దగ్గర చేయడానికి ప్రయత్నించాడు ఉమాపతి. రకరకాల మెటీరియల్​తో బొమ్మలు చేసి చూపించాడు వాళ్లకి. కానీ, తర్వాత ఆలోచిస్తే.. పేద కుటుంబాల నుంచి వచ్చిన స్టూడెంట్స్​ అన్ని డబ్బులు పోసి క్రాఫ్టింగ్​కి అవసరమయ్యే సామాన్లు కొనలేరని రియలైజ్​ అయ్యాడు. అందరికీ అందుబాటులో ఉండే నేచురల్​ మెటీరియల్​తో బొమ్మలు చేయడం నేర్పించాలనుకున్నాడు. అలానే చేశాడు. అప్పటివరకు తన​ క్లాస్​లకి ఆమడ దూరంగా ఉన్న పిల్లలు కూడా ముందు వరుసలో వచ్చి కూర్చున్నారు. అడిగి మరీ వీకెండ్స్​లో ​స్పెషల్​ క్లాసులు పెట్టించుకున్నారు. ఉమాపతి గైడెన్స్​తో.. వేస్ట్​ మెటీరియల్​తోనూ అద్భుతాలు చేయొచ్చని నమ్మారు స్టూడెంట్స్​. రకరకాల జంతువులు, పక్షులు, వెహికల్స్, మనుషుల బొమ్మలు, షో పీస్​లు తయారు చేయడం మొదలుపెట్టారు. 
 

ఇరవైమంది ఫైన్​ ఆర్ట్స్​లో చేరారు
సంవత్సరంలోనే వేస్ట్​ మెటీరియల్​తో మూడొందలకి పైగా ఆర్ట్​ పీస్​లు తయారుచేశారు పిల్లలు. బ్యాచ్​లు మారుతున్నా కొద్దీ వాటి సంఖ్య మరింత పెరగడంతో స్కూల్​ గోడలనే ఎగ్జిబిషన్​ సెంటర్​గా మార్చాడు ఉమాపతి. స్టూడెంట్స్​ తయారుచేసిన బొమ్మల్ని వివిధ కాంపిటీషన్స్​కి పంపించాడు. అన్నింట్లో మొదటి ప్రైజ్​ రావడంతో.. ఉమాపతి  టాలెంట్ సోషల్​ మీడియాలోనూ వైరల్​ అయింది. దాంతో చాలామంది వాటిని చూడటానికి అతను పనిచేస్తున్న స్కూల్​కి ‘క్యూ’ కట్టారు. పిల్లలకి, టీచర్స్​కి వర్క్​షాప్స్​ కండక్ట్ చేయమని  పిలుపు వచ్చింది అతనికి. బయటి దేశాల్లోనూ స్పెషల్​ క్లాసులు తీసుకున్నాడు ఉమాపతి. అన్నింటికీ మించి చాలామంది స్టూడెంట్స్​ని ఇన్​స్పైర్​ చేస్తున్నాడు. తాను పాఠాలు చెప్పిన ఇరవైమంది స్టూడెంట్స్​ ఇప్పటికే ఫైన్​ ఆర్ట్స్​లో బ్యాచిలర్స్​ చేస్తున్నారు. అంతేకాదు, చాలామందిని  పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాడు. వీలైనంత ఎక్కువమందికి  క్రాఫ్టింగ్​ నేర్పించాలన్నదే తన కోరిక అంటున్నాడు. ఉమాపతి స్టూడెంట్స్​లో చాలామంది బొమ్మల తయారీని ఉపాధిగా చేసుకున్నారు. అలాగే  ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ పర్మిషన్​ తీసుకుని.. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో మహిళల కోసం క్రాఫ్టింగ్​ వర్క్​షాప్స్​​ కండక్ట్​ చేశాడు ఉమాపతి. వాళ్లలో చాలామంది చిన్నపాటి బొమ్మల బిజినెస్​లు పెట్టుకున్నారు. అయితే వాళ్లందరికీ నేను కేవలం బొమ్మలు ఎలా చేయాలన్నది​ మాత్రమే చెప్పా.. మిగతాదంతా వాళ్ల క్రియేటివిటీనే అంటున్నాడు ఈ ఆర్ట్ టీచర్​.