ఓటర్లతో గర్భగుడిలోకి వెళ్లి ఒట్లు

ఓటర్లతో గర్భగుడిలోకి వెళ్లి ఒట్లు
  •     టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి నిర్వాకం
  •     100 మంది ‘లోకల్’ ఓటర్లతో ప్రధానాలయంలోకి
  •     రూల్స్ కు విరుద్ధమంటూ భక్తుల మండిపాటు
  •     కిషన్ రావు పర్మిషన్ తీసుకున్నరు: ఈవో గీతారెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు: లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటర్లు సొంత అభ్యర్థులకే ఓటేసేలా చూసేందుకు ఆ పార్టీ లీడర్లు నానాతిప్పలు పడుతున్నారు. క్యాంపుల్లో పెట్టినా, రాజభోగాలు కల్పించినా, డిమాండ్లన్నీ తీరుస్తున్నా చివరికి ఎక్కడ హ్యాండిస్తారో అని సతమతమవుతున్నారు. దాంతో ‘పార్టీ అభ్యర్థికే ఓటేస్తాం’ అని ఓటర్లతో ఏకంగా ఒట్లు పెట్టించుకుంటున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ లోకల్ ఓటర్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏకంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయంలోనే ఈ మేరకు ఒట్లు పెట్టించినట్టు సమాచారం. ఓటర్లను ఆయన ఘట్కేసర్లోని ఓ రిసార్ట్ కు తరలించారు. రెండు రోజులు అక్కడుంచి గురువారం యాదాద్రి తీసుకెళ్లారు. బాలాలయంలో పూజల తర్వాత స్వయంభూ నారసింహుడు కొలువైన ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. పూజల తర్వాత, ‘పార్టీ అభ్యర్థికే ఓటేస్తాం’ అని ఓటర్లతో ఎమ్మెల్యే ప్రమాణం చేయించినట్టు తెలుస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ లీడర్లు బయటికొచ్చాక గుంపులుగా గిరి ప్రదక్షణ చేశారు.

రూల్స్​ను తుంగలోకి తొక్కి..
వైటీడీఏ నిబంధనల ప్రకారం కొండపై పునర్నిర్మాణంలో ఉన్న స్వామివారి ప్రధానాలయంలోకి వైటీడీఏ, వీవీఐపీలకు తప్ప ఎవరికి అనుమతి లేదు. లింగయ్య మాత్రం ఏకంగా 100 మందితో అందులోకి వెళ్లారు. సామాన్య భక్తులకు ఓ రూలు, టీఆర్ఎస్ లీడర్లకు మరో రూలా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆఫీసర్లు, ఈవో గీతారెడ్డి టీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటర్లకు స్వయంభూ నారసింహుని దర్శనం కోసం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు నుంచి ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకున్నారని ఈవో గీతారెడ్డి చెప్పారు.