కండక్టర్ల ఫొటోలతో మళ్లీ ఫ్లెక్సీ

కండక్టర్ల ఫొటోలతో మళ్లీ ఫ్లెక్సీ
  •     డైలీ పాస్ లు తక్కువ అమ్మారని కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టిన అధికారులు

డే పాస్ అమ్మకాలపై టార్గెట్లు పెట్టి ఆర్టీసీ కండక్టర్లను డిపో మేనేజర్లు వేధిస్తున్నారు. ఇటీవల మేడ్చల్​ డిపో వద్ద  ఫ్లెక్సీ పెట్టడం వివాదాస్పదమైంది. అయినా మియాపూర్​ డిపో-2 వద్ద కూడా అధికారులు 15 మంది కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఉద్యోగులపై అధికారుల వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. డైలీ పాస్ లు తక్కువ అమ్మిన కండక్టర్ల ఫొటోలతో డీఎంలు డిపోల దగ్గర ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. బుధవారం మేడ్చల్, గురువారం మియాపూర్ 2 డిపోలో ఫ్లెక్సీలు పెట్టారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ సర్క్యులేట్  కాగానే తొలగించారు. కూకట్ పల్లి, హెచ్ సీయూ, ఉప్పల్  డిపోల్లో సైతం ఫ్లెక్సీల ఏర్పాటుకు డీఎంలు ప్రయత్నాలు చేయగా ఆ విషయం వివాదం కావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. సికింద్రాబాద్  రీజియన్  పరిధిలోని మొత్తం 11 డిపోల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని రీజనల్  మేనేజర్  వెంకన్న ఆదేశించారని, డిపో మేనేజర్లు ఆయన ఆదేశాలు పాటిస్తున్నారని డిపోల్లో చర్చ జరుగుతోంది. తక్కువ టికెట్లు అమ్మిన కండక్లర్ల ఫొటోలు ఇవ్వకుంటే, వారి వాట్సాప్  డీపీల నుంచి ఫొటోలు తీసి ఫ్లెక్సీల్లో పెట్టారని కార్మికులు చెబుతున్నారు. మేడ్చల్ డిపో ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా వివాదం కావడంతో మియాపూర్ 2 డిపో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వెంటనే తొలగించారు. కూకట్ పల్లి, ఉప్పల్, హెచ్ సీయూ డిపోలతో సికింద్రాబాద్  రీజియన్ లోని మొత్తం 11 డిపోల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్లకు ఆర్ఎం వెంకన్న ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఈ విషయం వివాదం కావడంతో మిగతా డిపోల్లో అధికారులు వెనక్కి తగ్గారని సమాచారం. మరోవైపు ఫ్లెక్సీల ఏర్పాటుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగుల ఫొటోలతో ఫ్లెక్సీ పెట్టడం వారిని కించపరచడమే అని పేర్కొన్నారు. డీఎం, ఆర్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్  చేయాలని నేతలు కోరుతున్నారు. 

ఫ్లెక్సీలు పెట్టడం తప్పే: ఎండీ 

ఆర్టీసీ నష్టాల నుంచి ఇపుడిపుడే గాడిన పడుతున్నది. ఇలా ఫ్లెక్సీలు పెట్టడం తప్పే. తక్కువ టికెట్లు అమ్మిన కండక్టర్లను పిలిచి కౌన్సెలింగ్  ఇవ్వాలని, వారి నుంచి వివరణ కోరాలని డీఎంలను ఆదేశించినం. కానీ, వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగనియ్యం. 

అధికారుల వేధింపులు ఎక్కువైనయ్ : టీఎంయూ 

యూనియన్లు లేకపోవడంతో ఉద్యోగులపై అధికారుల వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని టీఎంయూ నేతలు పేర్కొన్నారు. ఫ్లెక్సీలు పెట్టి ఉద్యోగులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సెలవులు అడిగితే ఫ్రూఫ్ లు చూపించాలని అడుగుతున్నారని వాపోయారు.  ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెబుతున్న అధికారులు.. ఎందుకు వస్తున్నాయో రివ్యూలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. .