ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?

 ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ఇంకా ముగియలేదు.  ఇప్పటివరకు ఆడిన 11 లీగ్ దశ మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఓడి మూడింట్లో మాత్రమే గెలుపొందింది. మే 3వ తేదీ శుక్రవారం ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.   దీంతో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. తాజా ఓటమితో MI మొదటి మూడు స్థానాల్లో నిలిచే అవకాశాలు లేవు. అయితే, ప్లేఆఫ్ రేసులో నిలిచే ఛాన్స్ ఇంకా ముంబైకి ఉంది. అదెలాగో చూద్దాం..

ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 6 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే.. మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే.  ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లు ఇప్పటి వరకు ఆడిన 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లలో వరుసగా 16 , 14 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

 ఇక, 12 పాయింట్లతో LSG,  SRH జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు  మే 8న ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా.. 14 పాయింట్లు సాధించి మూడోస్థానానికి చేరుకుంటుంది. దీంతో నాలుగో స్థానం కోసం ముంబై పోటీ పడాల్సి ఉంటుంది.

మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఎస్ఆర్ హెచ్, కేకేఆర్, ఎల్ఎస్ జీ జట్లపై  విజయం సాధించగలిగితే ముంబై గరిష్టంగా12 పాయింట్లకు చేరుకోవచ్చు.  ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు ముంబైకి అనుకూలంగా వస్తే 4వ స్థానంలో నిలిచేందుకు 12 పాయింట్లు సరిపోతాయి. అయితే, అన్ని మ్యాచ్ లలో ముంబై గెలిచినా.. మిగతా జట్లపై ఆధారపడాల్సిందే. ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను పరిశీలిస్తే..

KKR (మే 5), SRH (మే 8), DC (మే 14), MI (మే 17)తో జరగాల్సి నాలుగు లీగ్ దశ మ్యాచ్‌లలో LSG ఓడిపోయి.. మిగిలిన మూడు మ్యాచ్‌లను ముంబై గెలిస్తే.. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి IPL 2024 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి అత్యుత్తమ అవకాశం ఉంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా 12 పాయింట్ల మార్కును దాటకూడదని కోరుకోవాల్సిందే. ఒకవేళ వీటిలో ఏ ఒక్క జట్టు12 పాయింట్ల మార్క్ దాటితే.. ముంబై, మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలిచినా లాభం లేకపోవచ్చు. ఎందుకంటే అన్ని జట్ల కంటే ముంబై రన్ రేట్ తక్కువగానే ఉంది. 

ముంబై అనుకున్నట్లు అన్నీ జరిగితే.. ముంబై, పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే..  ఈ నెల 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆడే అవకాశం ఉంది.