అమరావతి వెంకన్న గుడికి రూ.36 కోట్లు చాలు

అమరావతి వెంకన్న గుడికి రూ.36 కోట్లు చాలు
  • టీటీడీ ధర్మకర్తల మండలి తొలి భేటీలో తీర్మానం

తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గిస్తూ బోర్డు తీర్మానం చేసింది. గతంలో రూ.150 కోట్లతో నిర్మాణం చేపట్టాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టారు. రూ.36 కోట్లతో వెంకన్న గుడి కట్టాలని నిర్ణయించారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనా చర్చించారు.

తిరుపతి అవిలాల చెరువు అభివృద్ధికి రూ.48 కోట్లు కేటాయిస్తూ.. ఇవాళ్టి బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటుకు తీర్మానించారు. టీటీడీ చీఫ్ ఫైనాన్స్, స్టాటిస్టికల్ ఆఫిసర్ గా రవిప్రసాద్‌ను నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

చైర్మన్ వైవీ  సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి  ఈవో అనిల్ కుమార్  సింఘాల్,  పాలకమండలి  సభ్యులు, ప్రత్యేక  ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో  సభ్యులు హాజరయ్యారు. శ్రీవారి  బ్రహ్మోత్సవాలతో పాటు తిరుమలలో  పలు అభివృద్ధి  కార్యక్రమాలపై  సమావేశంలో  చర్చించారు.

అంతకుముందు  శ్రీవారి ఆలయంలో  టీటీడీ బోర్డు  సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిది. ఉదయం 9 గంటల  నుంచి  పదిన్నర మధ్య తెలంగాణకు చెందిన జూపల్లి  రామేశ్వర్ రావు, మూరంసెట్టి  రాములు, శివ కుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డి,  పార్థసారధి రెడ్డి,  ఇండియా సిమెంట్స్  అధినేత  శ్రీనివాసన్…  ప్రమాణం చేశారు.  ఆలయంలోని  బంగారు వాకిలి  దగ్గర టీటీడీ  ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వీరితో  ప్రమాణం చేయించారు.