ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే

ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే

కోటి రూపాయలు అంటేనే అమ్మో అంటాం.. అదే 500 కోట్ల రూపాయలు అంటే వామ్మో అంటాం.. అదే 2 వేల కోట్ల రూపాయలు అంటే.. అమ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. 2 వేల కోట్ల రూపాయల నోట్ల కట్టలు రోడ్డుపై ఎలా తీసుకెళతారో తెలుసా.. ఇది ఈ ఫొటోలో చూపిస్తున్నట్లు భారీ కంటైనర్లలో.. 

అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి దగ్గర వాహనాల తనిఖీలు సందర్భంగా.. 2 వేల కోట్ల రూపాయలు డబ్బు పోలీసుల కంట పడింది. పామిడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కోడ్ లో భాగంగా.. జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా భారీ కంటైనర్లు రావటం గమనించారు పోలీసులు. ఆ వాహనాలను ఆపి పరిశీలించగా.. అందులో 2 వేల కోట్ల రూపాయల డబ్బు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. అవాక్కయిన తనిఖీ పోలీసులు.. ఇంత పెద్ద మొత్తంలో నగదు కంటైనర్ల విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

విచారణలో భాగంగా.. ఈ డబ్బు కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో హైదరాబాద్ తరలిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. ఇన్ కం ట్యాక్స్  అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇది బ్యాంకుల సొమ్ము అని నిర్థారణ అయ్యింది. 

ఈ 2 వేల కోట్ల రూపాయల్లో..  500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు డబ్బు అని.. మరో 500 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ డబ్బు అని.. మరో వెయ్యి కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు నిర్థారించారు.  డబ్బు మొత్తం సక్రమమైన పద్ధతిలోనే.. ప్రభుత్వ ఉత్తర్వులతో వెళుతున్నట్లు నిర్థారణకు వచ్చి.. ఆ డబ్బుల కంటైనర్లను హైదరాబాద్ పంపించారు అనంతపురం పోలీసులు.