ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ కమిటీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ కమిటీ

తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిపై విచారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అడ్వకేట్‌ జనరల్‌ను కేబినెట్ న్యాయ సలహా కోరింది. చార్జిషీట్‌లో లేకున్నా నేరస్థులను వదలమని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఇప్పటికే నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత.. తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో.. జంతువుల కొవ్వు లేదని.. జంతువుల నుంచి తీసిన కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని సీబీఐ స్పష్టం చేసింది.

జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో.. జంతువుల కొవ్వు ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడంతో సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణ జరిపింది. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారు చేసిన లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని.. కల్తీ జరగలేదని.. స్పష్టం చేస్తూ సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.

జనవరి 23, 2026న ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో కూరగాయల నూనెలు, కృత్రిమ పాల ఉత్పత్తులలో వాడే ఈస్టర్‌లు కలిపి కల్తీ చేశారని చార్జిషీట్లో సీబీఐ నేతృత్వంలోని సిట్ పేర్కొంది. నెయ్యిలో జంతువుల కొవ్వు జాడ లేదని స్పష్టం చేసింది.