- ఒక్కో లెక్చరర్ కు ఒకటే నంబర్.. కాలేజ్ మారినా అదే ఐడీ
- ఒకేసారి రెండు, మూడు కాలేజీల్లో పనిచేసే వారికి షాక్
- ఇప్పటికే 41 వేల మందికి నంబర్లు అలాట్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ జూనియర్ కాలేజీల నిర్వహణలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లెక్చరర్ల నియామకాల్లో పారదర్శకతను పెంచేందుకు, ఒకే లెక్చరర్ పలు చోట్ల పనిచేస్తున్నట్టు చూపుతూ నకిలీ లెక్కలు రాస్తున్న మేనేజ్మెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ‘యూనిక్ ఐడీ’ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానం ద్వారా ఫేక్ ఫ్యాకల్టీ ఏరివేతతో పాటు, ఒకే లెక్చరర్ రెండు మూడు చోట్ల పనిచేయడాన్ని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియలో ఈ యూనిక్ ఐడీలు కీలకం కానున్నాయి.
రాష్ట్రంలోని సుమారు1,463 ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 41 వేల మందికి పైగా సిబ్బందికి తొలిసారిగా ఇంటర్ బోర్డు ఇటీవల యూనిక్ ఐడీ నంబర్లను కేటాయించింది. వీటిని ఆధార్ నంబర్లతో అనుసంధానం చేశారు. ఈ విధానం ప్రకారం.. ఒక లెక్చరర్ కు ఒకసారి కేటాయించిన నంబర్ పర్మినెంట్ గా ఉంటుంది. ఆ లెక్చరర్ ఒక కాలేజీ మానేసి వేరే కాలేజీలో చేరినా, అదే ఐడీ నంబర్ కంటిన్యూ అవుతుంది. దీంతో ఆ లెక్చరర్ సర్వీస్ హిస్టరీ మొత్తం ఆ ఒక్క నంబర్ ద్వారా బోర్డుకు తెలిసిపోతుంది. త్వరలోనే ఇంటర్ ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంట్లో యూనిక్ ఐడీలు కీలకంగా మారనున్నాయి.
డూప్లికేషన్‌కు అడ్డుకట్ట..
ప్రస్తుతం పలు కాలేజీల్లో చాలా మంది లెక్చరర్లు ఒకే సమయంలో రెండు, మూడు కాలేజీల్లో పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ఇది ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రధానంగా లాంగ్వేజీ సబ్జెక్టులతో పాటు కీలకమైన మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల లెక్చరర్లు మల్టిపుల్ కాలేజీల్లో పని చేస్తున్నారు. పేర్లలో స్వల్ప మార్పులు, ఇంటి పేర్లు తీసేసి.. లెక్చరర్లగా చూపిస్తున్నారు. ఇంటర్ బోర్డు రూల్స్ ప్రకారం అదనపు సెక్షన్లకు అదనపు లెక్చరర్లు ఉండాలి.
కానీ, చాలా కాలేజీల మేనేజ్మెంట్లు ఉన్న వారితోనే నెట్టుకొస్తూ, అదనపు క్లాసులు చెప్పిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నాయి. యూనిక్ ఐడీ విధానం అమలైతే.. ఒక ఐడీ ఒక కాలేజీకి మాత్రమే లింక్ అయినందున డూప్లికేషన్ కు చాన్స్ ఉండదు. యాజమాన్యాలు కొత్త స్టాఫ్ ను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం ప్రొఫెషనల్ కాలేజీల్లో అమలు చేస్తున్నారు.
బ్లాక్ లిస్టులో ఉన్న వారికి కష్టమే..
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ లాంటి విధుల్లో తప్పులు చేసిన ప్రైవేట్ లెక్చరర్లపై బోర్డు చర్యలు తీసుకుంటుంది. కానీ, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన లెక్చరర్లు.. వేరే కాలేజీలో చేరి మళ్లీ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పుడు యూనిక్ ఐడీ ఉండటంతో.. ఏ కాలేజీలో చేరినా వారిపై ఉన్న పాత కేసులు, చర్యల చిట్టా బయటపడుతుంది.
కాగా, ఇంటర్ విద్యలో మరింత పారదర్శకత పెంచేందుకు యూనిక్ ఐడీ విధానం తీసుకొచ్చామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. నిబంధనల ప్రకారం కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నారో లేదో అనేది ఈ ఐడీల ద్వారా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
