- త్వరలోనే భూ భారతిలో రిజిస్ట్రేషన్లకు ఇది తప్పనిసరి
- రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు
- పాత సర్వే నంబర్లకు కాలం చెల్లినట్లే.. వాటి స్థానంలో యూనిక్ నెంబర్
- రికార్డుల్లో ఉన్నది కాదు.. గ్రౌండ్‌లో ఉన్నదే ప్రామాణికం
- క్షేత్రస్థాయి కొలతల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నది. కేవలం కాగితాల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులే ప్రామాణికంగా ‘సర్వే ఆధారిత రిజిస్ట్రేషన్ల’ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. ఇందులో భాగంగా ‘భూభారతి’ చట్టం ప్రకారం భూ భారతి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ‘ల్యాండ్ పార్శిల్ మ్యాప్’ (ఎల్‌పీఎం) నంబర్‌ను తప్పనిసరి చేయనున్నది.
గతంలో మాదిరిగా సర్వే నంబర్ చెబితే సరిపోదు.. భూమి కచ్చితమైన సరిహద్దులు నిర్ధారించే ఎల్‌పీఎం ఉంటేనే రిజిస్ట్రేషన్ ముందుకు సాగుతుంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో, సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రభుత్వం నిబంధనను కఠినంగా అమలు చేయాలని చూస్తున్నది.
ఒకే సర్వే నంబర్ పరిధిలో అనేక మంది యజమానులు ఉండే పాత విధానానికి భిన్నంగా, ఎల్‌పీఎం విధానంలో ప్రతి చిన్న భూమి ముక్కకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీనివల్ల భూమి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి.. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు, సరిహద్దు వివాదాలకు తావులేకుండా భూమికి పూర్తి రక్షణ లభిస్తుంది.
సమగ్ర సమాచారంతో యూనిక్ ఐడెంటిటీ..
దశాబ్దాల నాటి సంక్లిష్టమైన సర్వే నంబర్ల వ్యవస్థ స్థానంలో అత్యాధునికమైన ‘ల్యాండ్ పార్శిల్ మ్యాప్’ విధానం తేవాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. ఇది కేవలం ఒక మ్యాప్, ఒక అంకె మాత్రమే కాదు, ఆ భూమి ఎక్కడ ఉంది? దాని అక్షాంశ, రేఖాంశాలు (జియో కోఆర్డినేట్స్) ఏమిటి? రెవెన్యూ రికార్డుల్లో దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే సమగ్ర సమాచారంతో యూనిక్ ఐడెంటిటీ అని అధికారులు చెబుతున్నారు.
పాత రికార్డుల లింక్ కోసం ప్రస్తుతానికి సర్వే నంబర్లను ఎల్‌పీఎంతో అనుసంధానించినప్పటికీ.. భవిష్యత్తులో పూర్తిగా ఎల్‌పీఎం నంబర్ల ద్వారానే లావాదేవీలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకోవడం, డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడంలాంటి అక్రమాలకు చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
భూమి మీదున్నదే ఫైనల్
కొత్త విధానంలో కీలకమైన మార్పు ‘విస్తీర్ణ నిర్ధారణ’. గతంలో పట్టాదారు పాసుపుస్తకంలో లేదా పాత డాక్యుమెంట్లలో ఎంత భూమి ఉంటే అంత గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసేవారు. క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? లేదా? అనేది ఎవరూ చూసేవారు కాదు. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన రికార్డుల్లో మూడెకరాల భూమి ఉందని క్లెయిమ్ చేసినా, అధికారులు నిర్వహించే సర్వేలో అది 2.5 ఎకరాలే అని తేలితే.. ఆ 2.5 ఎకరాలే రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
ఇలా చేయడం వల్ల రికార్డుల ప్రక్షాళన జరగడమే కాకుండా, లేని భూములను సృష్టించి అమ్మకాలు జరిపే రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియలో లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మొదట లైసెన్స్ పొందిన ప్రైవేట్ సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి భూమిని కొలిచి ప్రాథమిక నివేదిక ఇస్తారు.
తర్వాత ప్రభుత్వ మండలస్థాయి సర్వేయర్లు ఆ కొలతలను, సరిహద్దులను తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. రెవెన్యూ, సర్వే రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయంతో రూపొందించిన ప్రత్యేక వర్క్‌ఫ్లో ద్వారానే ఈ ఫైల్ కదులుతుంది. ఇలా రెండు, మూడు దశల్లో జరిగే వడపోత వల్ల భూమి కొలతల్లో కచ్చితత్వం ఉంటుంది. తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చే ఆస్కారం లేకుండా అధికారులపై జవాబుదారీతనాన్ని పెంచుతూ ఈ కొత్త విధానాన్ని రూపొందించారు.
త్వరలో ‘కటాఫ్’ తేదీ ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.83 లక్షల భూకమతాల ఖాతాలకు (సర్వే నంబర్లు) ఈ కొత్త పద్ధతిలో ఎల్‌పీఎం నంబర్లను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. సర్వే నంబర్ల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను ఎప్పటి నుంచి పూర్తిగా నిలిపివేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం త్వరలోనే ఒక ‘కటాఫ్ తేదీ’ని ప్రకటించనున్నది. ఆ గడువు తర్వాత కేవలం ఎల్‌పీఎం ఆధారంగా, వాస్తవ విస్తీర్ణం మేరకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
భూ వివాదాలకు ఇదొక శాశ్వత పరిష్కారమని, సర్వే చేసి ఎల్‌పీఎం కేటాయించడం వల్ల ప్రతి అంగుళం భూమికి లెక్క పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలోని అస్తవ్యస్త విధానాలకు స్వస్తి పలికి, పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసమే ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
