లాభాల్లో దూసుకెళ్తున్న యూకో బ్యాంక్

లాభాల్లో దూసుకెళ్తున్న యూకో బ్యాంక్

హైదరాబాద్​, వెలుగు: గత రెండు క్వార్టర్లుగా లాభాలలో దూసుకెళ్తున్న యూకో బ్యాంక్​ ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో రూ. 1,500 కోట్ల లాభం సంపాదించాలని టార్గెట్​గా పెట్టుకుంది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లోని మొదటి ఆరు నెలల్లో బ్యాంకు రూ. 625 కోట్ల లాభం ఆర్జించింది. హైదరాబాద్​లో యూకో బ్యాంక్​ నిర్వహించిన  ఎక్స్​పోర్టర్స్​ మీట్​లో పాల్గొనడానికి వచ్చిన మేనేజింగ్​ డైరెక్టర్​, సీఈఓ  సోమ శంకర ప్రసాద్​ ఈ విషయం వెల్లడించారు. ప్రాంప్ట్​ కరెక్టివ్​ యాక్షన్​ నుంచి బయటకు రావడంతో 2022–23లో కొత్తగా 200 బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఇందులో తెలంగాణలో 4, ఆంధ్ర ప్రదేశ్​లో ఒకటి ఏర్పాటవుతాయని శంకర్​  ప్రసాద్​ తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్​ తర్వాత అత్యధిక క్యాపిటల్​ యాడిక్వసీ రేషియో ఉన్న బ్యాంక్​ తమదేనని పేర్కొన్నారు. ఈ ఫైనాన్షియల్​ఇయర్లో రూ.1,500 కోట్ల లాభం సంపాదిస్తే, క్యాపిటల్​ యాడిక్వసీ రేషియో 15 శాతానికి చేరుతుందని అన్నారు. జూన్​, సెప్టెంబర్​ క్వార్టర్లలో స్లిపేజెస్​ రూ. 500 కోట్లకు మించలేదని, ఇదే సమయంలో ఈ రెండు క్వార్టర్లలోనూ రికవరీలు రూ. 500 కోట్లు దాటాయని శంకర్​ ప్రసాద్​ వెల్లడించారు. అడ్వాన్సులలో 17 శాతం, డిపాజిట్లలో 10 శాతం గ్రోత్​ సాధించినట్లు వివరించారు. గ్రాస్​, నెట్​ ఎన్​పీఏలు బాగా తగ్గాయని చెబుతూ, టైర్​1 కింద రూ. 1,000 కోట్ల నిధులను సమీకరించే ప్లాన్​లో ఉన్నామని వెల్లడించారు. ఈ ప్రపోజల్​కు బోర్డు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, స్టీల్​, సిమెంట్​, రెన్యువబుల్​ ఎనర్జీ, ఎన్​బీఎఫ్​సీలు ఎక్కువగా అప్పుల కోసం వస్తున్నట్లు చెప్పారు. మార్చి 2023 నాటికి రూ. 3.70 లక్షల కోట్ల బిజినెస్​ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో...

తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు క్రెడిట్ డిపాజిట్​ రేషియో 200 శాతంగా ఉందని చెబుతూ, ఇక్కడి నుంచి రూ. 9,500 కోట్ల బిజినెస్​ వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​లలో ప్రస్తుతం 81 బ్రాంచీలు ఉన్నాయని శంకర్​ ప్రసాద్​ చెప్పారు. బ్యాంకుకు మొత్తం 3,100 బ్రాంచీలున్నాయి. సెప్టెంబర్​ క్వార్టర్లో అసాధారణమైన పనితీరుతో 145 శాతం గ్రోత్​ కనబరచడంతో యూకో బ్యాంక్​ షేరు ధర ఇంచుమించుగా మూడింతలవడం విశేషం. డిజిటైజేషన్​పై ఫోకస్​ పెడుతున్నామని, ఇదే టైములో సైబర్​ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని శంకర్​ ప్రసాద్​ చెప్పారు.