ప్రతి నాలుగు కిలోమీటర్లకు ప్రభుత్వ పాఠశాల

ప్రతి నాలుగు కిలోమీటర్లకు ప్రభుత్వ పాఠశాల

గుజరాత్​లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆప్​ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ కంచుకోటలో పాగా వేసేందుకు చీపురు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా విద్య ప్రమాణాలపై ఫోకస్​ పెట్టింది. గుజరాత్​లో పాఠశాలలను ఉద్దేశించి విమర్శలు చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియాపై కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవీయా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధ్యయనం చేసి ఢిల్లీలో కూడా అమలు చేయాలని సూచించారు.

ఆప్ బృందం చేసిన పాఠశాలల మ్యాపింగ్ ప్రకారం గుజరాత్‌లోని 48,000 ప్రభుత్వ పాఠశాలల్లో 32,000 పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయని మనీష్​ సిసోడియా విమర్శించారు. ఆప్​ అధికారంలోకి వస్తే ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 18,000 పాఠశాలల్లో తరగతి గదులు లేవన్న సిసోడియా.. ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.  చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు లేరన్నారు. గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపు  ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని సిసోడియా తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి తనదైన శైలిలో సిసోడియాకు కౌంటర్​ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంతో అడ్మిషన్లు పెరిగాయని..డ్రాప్​ అవుట్ నిష్పత్తిని తగ్గించామని తెలిపారు. గుజరాత్​ లో 27 ఏండ్లుగా కాషాయ పార్టీ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీ కంచుకోటలో అడుగుపెట్టేందకు ఆప్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.