ఢిల్లీకి నీళ్ల పంచాయితీ!

ఢిల్లీకి నీళ్ల పంచాయితీ!

21న కృష్ణా, గోదావరి బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుతెలంగాణ, ఏపీ మధ్య నీళ్ల పంచాయితీ తేల్చడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల అధికారులు, రివర్​బోర్డులతో చర్చించాలని.. వివిధ అంశాలకు పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 21న ఢిల్లీలో కృష్ణా, గోదావరి మేనేజ్​మెంట్​ బోర్డుల (కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ)తో సమావేశం నిర్వహిస్తోంది. 21న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌‌‌‌‌‌‌‌లో సమావేశం నిర్వహిస్తామని, దానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల స్పెషల్‌‌‌‌‌‌‌‌  సీఎస్‌‌‌‌‌‌‌‌లు, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఇతర అధికారులకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌కే కనోడియా లేఖ రాశారు. కృష్ణా బోర్డు హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ ఏపీకి తరలింపు, దానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు, కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల కోసం డీపీఆర్‌‌‌‌‌‌‌‌ల సమర్పణ, నీటి సరఫరాలో నియంత్రణ, కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి, రెండో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహణతో పాటు కేంద్ర జలశక్తి కార్యదర్శి అనుమతితో మరేవైనా అంశాలపై భేటీలో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నారు. మంగళవారం ఆ లేఖ రాష్ట్ర అధికారులకు అందింది.

తలనొప్పులెన్నో..

కృష్ణా బోర్డు నిర్వహణకు నిధుల కొరత తీవ్రంగా ఉన్నట్టుగా కేంద్రం దృష్టికి వెళ్లింది. ఇరు రాష్ట్రాలు వాటా సొమ్ము ఇవ్వాలని బోర్డు ప్రతి మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కోరుతున్నా స్పందన రావడం లేదు. గోదావరి బోర్డుకు మొత్తంగా తామే నిధులిస్తున్నం కాబట్టి కృష్ణా బోర్డుకు ఖర్చు ఏపీనే చూసుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఇక రెండు నదీ బోర్డులకు సంబంధించి ఇప్పటివరకు వర్కింగ్‌‌‌‌‌‌‌‌ మ్యాన్యువల్స్‌‌‌‌‌‌‌‌, అధికార పరిధిని నిర్ణయించలేదు. ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని బోర్డులు ఎన్నోసార్లు కోరినా, రిమైండర్​ లెటర్లు రాసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇదిలాగే కొనసాగితే బోర్డుల ఏర్పాటు స్ఫూర్తే దెబ్బతింటుందన్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ, తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు పెండింగ్​లో ఉన్నాయి. వాటి విషయాన్నీ తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం.

నేడు కృష్ణా బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌

కృష్ణా బోర్డు 11వ జనరల్‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జల సౌధలో నిర్వహిస్తున్నారు. బోర్డు వర్కింగ్‌‌‌‌‌‌‌‌ మ్యాన్యువల్స్‌‌‌‌‌‌‌‌, అధికార పరిధి, బోర్డు హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ ఏపీకి తరలింపు, మే నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. ఇదే సమయంలో గోదావరి బోర్డు సమావేశం కూడా జలసౌధలో ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.