- ఆపై అసభ్యకరంగా వీడియోలు తీసి.. బెదిరించి లైంగిక దాడి
- చిన్నారులను వేధించిన యూపీ దంపతుల కేసులో బటయపడిన నిజాలు
న్యూఢిల్లీ: వీడియో గేమ్స్ ఆడే అవకాశం, చాక్లెట్లు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, డబ్బు వంటి చిన్న చిన్న బహుమతులతో మైనర్ అబ్బాయిలను ఇంటికి రప్పించుకునేవాళ్లు. అనంతరం వారిపై లైంగిక దాడులు చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసేవారు.
ఆపై తీసిన వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడుతూ ఏండ్ల తరబడి టీనేజర్లను మానసికంగా, శారీరకంగా వేధించారు. ఇలా పదేండ్లలో దాదాపు 33 మంది మైనర్ అబ్బాయిలను వేధించినందుకుగాను ఉరిశిక్ష పడిన యూపీకి చెందిన దంపతుల
కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మూడేండ్ల చిన్నారులనూ వదల్లే..
ఉత్తరప్రదేశ్‌లోని బాండా చిత్రకూట్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రామ్‌భవన్(45), ఆయన భార్య దుర్గావతి(42) కలిసి చిన్నారులపై దారుణాలకు పాల్పడ్డారు. వాళ్లు పనిచేస్తున్న ఏరియాలోనే రూమ్ కిరాయికి తీసుకున్న దంపతులు.. వీడియోగేమ్స్, చాక్లెట్లు, చిన్నచిన్న గిఫ్ట్‌లు కొనిస్తూ టీనేజ్ అబ్బాయిలను ఆకర్షించేవాళ్లు. ఆపై వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేవారు. ఆ ఫొటోలు, వీడియోలు చూపించి పిల్లలపై సంవత్సరాల తరబడి లైంగిక దాడులకు పాల్పడ్డారు. అలా అసభ్యకరంగా 2 లక్షలకుపైగా వీడియోలు తయారు చేసి, వాటిని డార్క్ వెబ్‌లో 40కి పైగా దేశాల్లో అమ్మేశారు. 2010 నుంచి 2020 మధ్య బాండా, చిత్రకూట్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ దంపతులు ఇద్దరూ ఈ నేరాలకు పాల్పడ్డారు. బాధిత పిల్లల్లో మూడేండ్ల చిన్నారుల నుంచి 18 ఏండ్ల బాలురు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
దంపతులకు ఉరి శిక్ష
2020 అక్టోబర్‌లో కేసు నమోదు చేసిన సీబీఐ, ఇంటర్‌పోల్ సాయంతో డార్క్ వెబ్‌లో 3 మొబైల్ నంబర్లను గుర్తించింది. అదే ఏడాది దంపతులను గుర్తించి అరెస్ట్ చేసింది. కేసు విచారించిన బాండాలోని పోక్సో కోర్టు.. దంపతులిద్దరికి మరణశిక్ష విధిస్తూ రెండ్రోజుల కింద తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన కోర్టు.. నిందితుల క్రూరత్వం నైతిక విలువల పునాదులను కదిలించిందని వ్యాఖ్యానించింది. నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకుని అందులోంచి బాధితులు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
