V6 News

తెలివి లేని వెధవ సూర్య..తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చుతావా.?: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలివి లేని వెధవ సూర్య..తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చుతావా.?: మంత్రి పొన్నం ప్రభాకర్

పార్లమెంట్  లో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. డీలిమిటేషన్ అంశంపై చర్చ జరుగుతుండగా, ఆయన ఏపీ-తెలంగాణ విభజనను ఏకంగా భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా సైతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా మాట్లాడారని, ఇప్పుడు అదే బాటలో తేజస్వీ సూర్య అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తేజస్వీ సూర్యను తెలివి లేని వెధవ అంటూ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడిన తెలంగాణను.. దేశ విభజనతో పోల్చుతారా? అని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్ రాష్ట్రం ఇస్తే, బీజేపీ ఎంపీలు దాన్ని అవహేళన చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

►ALSO READ | తెలంగాణ ఏర్పాటును.. పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య

తెలంగాణ ఏర్పాటును ఇంతలా అవమానిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు చీము నెత్తురు లేదా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తమ రాష్ట్రం అవమానానికి గురవుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డా అంటూ హెచ్చరించారు. ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడే తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పొన్నం.ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని, భవిష్యత్తులో ఇలాంటి వెధవలు మళ్ళీ నోరు పారేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.