కూరగాయలు కొనాలన్నా, బిర్యానీ తినాలన్నా.. కనీసం పాలప్యాకెట్ కొనుక్కోవాలన్నా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు ఇండియన్స్. అంతెందుకు రూపే క్రెడిట్ కార్డ్ నుంచి యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసే షాపులకే వెళ్లి కొనుక్కుంటున్నారు చాలా మంది ఇండియన్ మిడిల్ క్లాస్. జీతంలో ఎక్కువ భాగం ఈఎంఐలకే పోతున్న వేళ రోజువారీ ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజుల వరకూ అన్నీ అప్పుల తోనే నడిపిస్తున్నారు మిడిల్ క్లాస్. అందుకే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ వాడకం బీభత్సంగా పెరిగిందనే వాస్తవాలు తాజా స్టడీలో బయటకొచ్చాయి. పిల్లలకు పెన్ను కొనాలన్నా.. తిండి తినాలన్నా అప్పులపైనే భారతీయులు ఆధారపడటం ప్రజల అసలైన ఆర్థిక పరిస్థితికి అద్ధం పడుతోంది.
ఒకప్పుడు భారతీయులకు అప్పు అనే మాట వింటేనే భయం. కొన్నేళ్ల కిందటి వరకూ ఇల్లు కట్టుకోవడానికో లేదా పిల్లల పెళ్లిళ్లకో తప్ప సామాన్యుడు బ్యాంక్ మెట్లు ఎక్కేవాడు కాదు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రస్తుత ప్రపంచంలో అప్పు ఒక అవసరంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు లోన్ కావాలా? అంటూ బ్యాంకులు వెంట పడుతున్నాయి. ఈ ట్రెండ్ తో భారతీయ కుటుంబాల బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు 'సేవింగ్స్' నుంచి 'షాపింగ్ ఆన్ క్రెడిట్' వైపు వేగంగా మారుతోంది. భారతీయ మధ్యతరగతి ప్రజలు సంపాదన కంటే ముందే ఖర్చు చేసే క్రెడిట్ ఎకానమీ ఉచ్చులో చిక్కుకుపోయినట్లు క్లైంట్ అసోసియేట్స్ లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
కనిపించని అప్పు..
గతంలో రిటైల్ లోన్స్ అంటే కేవలం హౌసింగ్ లోన్ మాత్రమే గుర్తుకు వచ్చేది. 2016లో 53.6 శాతంగా ఉన్న హోమ్ లోన్స్ వాటా.. 2024 నాటికి 51 శాతానికి స్వల్పంగా తగ్గింది. మరోవైపు క్రిడెట్ కార్డ్స్ మార్కెట్లో భారీ గ్రోత్ నమోదైంది. 2016లో కేవలం 2.7 శాతంగా ఉన్న క్రెడిట్ కార్డ్ లోన్స్.. ఇప్పుడు దాదాపు డబుల్ అయ్యి 4.8 శాతానికి పెరిగాయి. గత 10 ఏళ్లలో ఈ కేటగిరీ లోన్స్ ఏకంగా 25 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తూ పోతున్నాయి. అంటే భారతీయులు ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవటం కంటే ఎక్కువగా జల్సాలు, రోజువారీ అవసరాల కోసమే అప్పులు చేసే పరిస్థితికి చేరుకున్నారని తేలింది.
తగ్గిన ఎడ్యుకేషన్ లోన్స్..
ఒకప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే 'ఎడ్యుకేషన్ లోన్స్' వాటా 4.9 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 2.2 శాతానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఎడ్యుకేషన్ కంటే లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికే ప్రజలు ఇండియాలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. సెక్యూరిటీ అవసరం లేని పర్సనల్ లోన్స్ వాటా 26.3 శాతానికి పెరిగి రెండో అతిపెద్ద రుణ కేటగిరీగా అవతరించింది. ఫిన్‌టెక్ కంపెనీల 'బై నౌ - పే లేటర్' ఆఫర్లు యువతను ఈ అప్పుల ఊబిలో పీకల్లోతు వరకూ ముంచేస్తున్నాయి.
జీడీపీతో పాటు పెరుగుతున్న అప్పులు..
జీడీపీలో రిటైల్ క్రెడిట్ వాటా 2016లో 10.1 శాతం ఉంటే.. అది 2025 నాటికి 18.1 శాతానికి చేరుతుందని అంచనా. బ్యాంకులు కూడా కార్పొరేట్ లోన్స్ కంటే పర్సనల్ లోన్స్ ఇవ్వటం పైనే ఫోకస్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఈ అప్పుల అలవాటు పైపైన మెరిసే లైఫ్ స్టైల్‌ను ఇస్తున్నా.. దీర్ఘకాలంలో భారతీయ కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంపాదనను మించిన ఖర్చు, ఈఎంఐల భారంతో ఇండియన్ ఫ్యామిలీస్ చిక్కుకుని చితికిపోతున్నాయి. కనీసం బిర్యానీ తినాలన్నా క్రెడిట్ కార్డులు వాడాల్సి రావటం అప్పులు కల్చర్ ఎంతలా పెరిగిందో నిరూపిస్తోంది.

