V6 News

'అదే నిజమైతే మాకు పిల్లలు ఉండేవారు'.. చిరాగ్ పాశ్వాన్‌తో రోమాన్స్‌పై కంగనా రనౌత్ క్లారిటీ!

'అదే నిజమైతే మాకు పిల్లలు ఉండేవారు'.. చిరాగ్ పాశ్వాన్‌తో రోమాన్స్‌పై కంగనా రనౌత్ క్లారిటీ!

బాలీవుడ్ క్వీన్ కంగానా రనౌన్ అంటేనే సంచలనం.. వెండితెరపై నటిగా ఎంతటి గుర్తింపును సొంతం చేసుకున్నారో.. రాజకీయాల్లో కూడా అంతే చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కంగానా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ల మధ్య ఏదో నడుస్తోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ రూమర్లపై ఈ బ్యూటీ తన దైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోమాన్స్ ఉంటే ఈపాటికి..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  చిరాగ్ పాశ్వాన్ తో డేటింగ్ రూమర్లపై అడగ్గా.. కంగానా రనౌత్ నవ్వుతూ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. చిరాగ్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. నిజం చెప్పాలంటే మా మధ్య ఎలాంటి రోమాన్స్ లేదు. పదేళ్ల క్రితమే మేము కలిసి సినిమా చేశాం. ఒకవేళ మా మధ్య ప్రేమ, రోమాన్స్ వంటివి ఉండి ఉంటే అప్పుడే మొదలయ్యేది. ఈపాటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు అంటూ తనదైన పంచ్ డైలాగ్‌తో రూమర్లకు చెక్ పెట్టారు కంగానా.

చిరాగ్ నుండి ఆ ‘వైబ్’ వస్తుంది.. కానీ!

చిరాగ్ పాశ్వాన్ కూడా సినిమా ఇండస్ట్రీ నుండే వచ్చారు కాబట్టి, ఆయన పక్కన ఉంటే తనకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని కంగనా పేర్కొన్నారు. మా మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ వైబ్ ఉంటుంది. నాకు రోమాన్స్ చేయాలని ఉంటే ఎప్పుడో జరిగేది. కానీ చిరాగ్‌ను చూసినప్పుడు నాకు ఒక స్నేహితుడు మాత్రమే కనిపిస్తాడు అని ఆమె వివరించారు. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ అనే సినిమాతో చిరాగ్ పాశ్వాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కంగనానే హీరోయిన్. అప్పటి పరిచయం ఇప్పుడు రాజకీయాల్లోనూ కొనసాగుతుండటంతో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి జనం చర్చించుకుంటున్నారు.  పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి.

హాలీవుడ్ అంటే మోజు లేదు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, చాలామంది నటీమణులు హాలీవుడ్ వైపు చూస్తుంటే, కంగనా మాత్రం దానికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో తాను చాలా సంతోషంగా ఉన్నానని, హాలీవుడ్ వైపు వెళ్లే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. హాలీవుడ్ సినిమాలకు ఒక నిర్దిష్టమైన ఎజెండా ఉంటుంది. అమెరికాను గొప్పగా చూపించడమే వారి పని. మన దేశాన్ని వదిలేసి, అమెరికాను గొప్పగా చూపించే సినిమాల్లో మనం ఎందుకు నటించాలి? మన దేశం కోసం ఇక్కడే సినిమాలు చేద్దాం.. అంటూ తనలోని దేశభక్తిని చాటుకున్నారు.

►ALSO READ | Samantha: 'తస్సాదియ్యా.. తగ్గేదేలేదు హుయ్యా'.. జోష్ పెంచుతున్న 'మా ఇంటి బంగారం' సాంగ్!

రాజకీయాల్లో ఎంపీగా బిజీగా ఉన్నప్పటికీ, కంగనా సినిమాలను వదలడం లేదు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు సిద్ధమవుతున్న ఈమూవీలో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు.  మొత్తానికి, చిరాగ్ పాశ్వాన్‌తో డేటింగ్ వార్తలకు కంగనా ఫుల్ స్టాప్ పెట్టడంతో ఈ చర్చ ప్రస్తుతానికి సద్దుమణిగింది.