వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండల వేడికి ఇళ్లల్లో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకూ ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మధ్యతరగతి ఇళ్లలో ఏసీల ఖర్చు భరించలేని వారు అటకపై ఉన్న ఎయిర్ కూలర్లను కిందకు దించి సిద్ధం చేసుకునే సమయం ఇది. అయితే చాలా మంది కంప్లెయింట్ చేసే విషయం ఏమిటంటే.. కూలర్ ఎంతసేపు వేసినా చల్లదనం అనుకున్నంత రావట్లేదు అన్నదే. నిజానికి కూలర్ పనితీరు మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ పాత కూలర్ కూడా ఏసీకి పోటీ ఇచ్చేలా చల్లటి గాలిని ఇస్తుంది. దీనికోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లటి నీరు ఐస్ క్యూబ్స్ మ్యాజిక్..
ఎయిర్ కూలర్ బేసిక్ ఫార్ములా ఏమిటంటే.. పోసిన నీరు ఎంత చల్లగా ఉంటే గాలి అంత హాయిగా వస్తుంది. అందుకే కూలర్ ట్యాంక్‌లో సాధారణ నీటి కంటే ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీటిని పోయడం వల్ల వెంటనే గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇంకా మెరుగైన ఫలితం కోసం నీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయటం బెటర్. ఐస్ క్యూబ్స్ వల్ల కలిగే ప్రభావం తాత్కాలికమే కాబట్టి.. ప్రతి 3 నుండి 4 గంటలకు ఒకసారి నీటిని చెక్ చేసుకోవటం మంచిది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ట్యాంక్‌లో ఐస్ వేస్తే.. నిద్రపోయేటప్పుడు ఏసీ గదిలో ఉన్నంత ఫీల్ కలుగుతుంది.
కూలింగ్ ప్యాడ్స్ చెక్కింగ్..
కూలర్ నుంచి వచ్చే గాలి క్వాలిటీ అది వాడుతున్న కూలింగ్ ప్యాడ్లపై ఆధారపడి ఉంటుంది. ప్యాడ్లు నీటిని పీల్చుకుని గాలిని చల్లబరుస్తాయి. వాడుతున్న కొద్దీ వీటిలో దుమ్ము, ధూళి చేరి గాలి ప్రవాహానికి అడ్డంకిగా మారతాయి. ఇది కేవలం గాలిని తగ్గించడమే కాకుండా.. చెడు వాసన వచ్చేలా చేస్తుంది. అందుకే వేసవి ప్రారంభంలోనే ప్యాడ్లను శుభ్రం చేయటం లేదా కొత్తవి మార్చాలి. సాధారణంగా రెండేళ్లకు ఒకసారి ప్యాడ్లు మార్చడం బెటర్. ప్యాడ్లతో పాటు ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయిన మొండి ధూళిని కూడా తుడవడం వల్ల గాలి వేగంగా వస్తుంది.
క్రాస్ ఎయిర్ సర్క్యులేషన్..
ఏసీకి, కూలర్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. ఏసీ వాడేటప్పుడు గది తలుపులు అన్నీ మూసి ఉంచాలి. కానీ కూలర్ వాడేటప్పుడు గదికి మంచి వెంటిలేషన్ అవసరం. కూలర్‌ను ఎప్పుడూ కిటికీకి దగ్గరగా లేదా బయటి గాలి వచ్చే దిశలో ఉంచాలి. గదిలోని వేడి గాలి బయటకు వెళ్లేందుకు ఒక తలుపు లేదా కిటికీ కొంచెం తెరిచి ఉంచడం వల్ల క్రాస్ వెంటిలేషన్ ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల గాలిలో తేమ పెరగకుండా, ఉక్కపోత లేకుండా చల్లగా మారుతుంది. కూలర్‌ను గోడకు ఆన్చి పెట్టకుండా కొంచెం ఖాళీ ఉంచడం వల్ల గాలి సర్క్యులేషన్ బాగుంటుంది.
ఉష్ణోగ్రతను పెంచే పరికరాలకు దూరంగా..
మీరు కూలర్ వాడుతున్న గదిలో ఉష్ణోగ్రతను పెంచే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్లు, పాతకాలపు ఫిలమెంట్ బల్బులు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. ఇవి ఆన్‌లో ఉన్నప్పుడు కూలర్ ఎంత చల్లని గాలి ఇచ్చినా గది త్వరగా చల్లబడదు. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన లైట్లను ఆపేయండి. కూలర్ వాడే ముందు గదిలోని వేడి గాలి బయటకు పోయేలా ఫ్యాన్ వేసి.. ఆ తర్వాత కూలర్ ఆన్ చేస్తే వేగంగా రూమ్ కూల్ అవుతుంది.
చివరగా వేసవికాలం ముగిసిన తర్వాత కూలర్‌ను స్టోర్ చేసేటప్పుడు నీటిని పూర్తిగా తీసివేసి, పొడిగా తుడిచి పెట్టడం వల్ల వచ్చే సమ్మర్‌కు అది తుప్పు పట్టకుండా, చెడిపోకుండా ఉంటుంది. ఈ చిన్నపాటి మెయింటెనెన్స్ టిప్స్ ఫాలో అయితే ఏసీ లేకుండానే మీరు సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోవచ్చు అది కూడా తక్కువ ఖర్చులోనే.

