తప్పుడు కథనాల వ్యాప్తిని అడ్డుకోవాలి : జెన్నిఫర్ లార్సెన్

తప్పుడు కథనాల వ్యాప్తిని అడ్డుకోవాలి : జెన్నిఫర్ లార్సెన్

హైదరాబాద్, వెలుగు : జర్నలిస్టులు తప్పుడు  సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ అన్నారు. తప్పుడు సమాచారం వల్ల సమాజానికి కలిగే ముప్పుపై  అవగాహన ఉండాలన్నారు.  తప్పుడు సమాచార కథనాలను గుర్తించి అవి వ్యాప్తి చెందకుండా చూడాలని ఆమె సూచించారు.  ఉస్మానియా యూనివర్సిటీ, యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో  ‘కౌంటరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్’  అంశంపై 8 నెలల పాటు ఇచ్చిన ట్రైనింగ్​ను పూర్తి చేసుకున్న 30 మంది  తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు  మంగళవారం ఓయూ సీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలో  వీసీ రవిందర్ యాదవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి  జెన్నీఫర్ లార్సెన్ సర్టిఫికెట్లు అందజేశారు.

తప్పుడు సమాచారం వ్యాప్తిచేసే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారని, అలాంటివి జనాలకు చేరకముందే నిరోధించటంలో జర్నలిస్టులు ముందజలో నిలుస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఓయూ జర్నలిజం విభాగానికి, అధ్యాపకులకు జెన్నీఫర్ లార్సెన్  కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని  ఓయూ జర్నలిజం డిపార్ట్​మెంట్ హెడ్, ప్రాజెక్ట్ సమన్వయకర్త  ప్రొఫెసర్ స్టీవెన్​సన్ కోహిర్ అన్నారు. అకడమిక్, విద్యాపరమైన అంశాలపై వస్తున్న తప్పుడు వార్తలు ఎలాంటి ఇబ్బందిని కలిగిస్తున్నాయో  వీసీ రవీందర్ యాదవ్ వివరించారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ట్రైనింగ్​లో ఫేక్ న్యూస్‌‌‌‌‌‌‌‌ను గుర్తించేందుకు జర్నలిస్టులను సిద్ధం చేయడం, ప్రధాన మీడియాలో  తప్పుడు సమాచారం రాకుండా నిరోధించాల్సిన అంశాల గురించి అవగాహన కల్పించారు.

వాస్తవ తనిఖీ సాధనాలు – పద్ధతులు, ఓపెన్ డేటాను కనుగొనే పద్ధతులు, తప్పుడు సమాచారం– చట్టపరమైన అంశాలు, వార్తలు, వీడియోలు, వచనం, చిత్రాలను ఎలా ధ్రువీకరించాలనే అంశాలపై శిక్షణనిచ్చారు. శిక్షణ పొందిన వారిలో 50 శాతం మహిళా జర్నలిస్టులు, ఐదుగురు జర్నలిజం విభాగానికి చెందిన స్టూడెంట్లున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ కొరీనా సురేశ్, ప్రాజెక్ట్ మెంబర్ డా. ఎస్. రాము, యూఎస్ కాన్సులేట్ జరనల్ డేవిడ్ మోయర్, ఓయూ సిబ్బంది పాల్గొన్నారు.