మ్యాక్స్​ హెల్త్​కేర్​లో వాటా అమ్మనున్న కేకేఆర్​

మ్యాక్స్​ హెల్త్​కేర్​లో వాటా అమ్మనున్న కేకేఆర్​

న్యూఢిల్లీ : అమెరికా ప్రైవేట్ ఈక్విటీ మేజర్ కేకేఆర్ ఆగస్టు 16న హాస్పిటల్ చైన్ మ్యాక్స్​ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌లో తన మొత్తం 27 % వాటాను అమ్మనుంది. ఈ లావాదేవీ ద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.  బ్లాక్ డీల్ ద్వారా వాటా అమ్మకం ఉంటుంది. మ్యాక్స్​కేర్​ హెల్త్‌‌‌‌కేర్​లో పెట్టుబడి పెట్టిన కేకేఆర్​-అనుబంధ సంస్థ అయిన కయాక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ద్వారా ఈ డీల్ అమలవుతుంది. ఆగస్టు 15న విడుదల చేసిన డీల్ వివరాల​ ప్రకారం, మ్యాక్స్​ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌లోని మొత్తం 26.7 కోట్ల షేర్లను ఒక్కో షేరు ధర రూ. 350-–361.9 వద్ద కేకేఆర్ అమ్ముతుంది. బేస్ ఆఫర్ దాదాపు 20 % వాటా లేదా 19.3 కోట్ల షేర్లకు కాగా,  మిగిలిన 6.83 % వాటా లేదా 6.6 కోట్ల షేర్లకు అప్‌‌‌‌సైజ్ ఆప్షన్‌‌‌‌. అప్పర్​ ఎండ్​లో మొత్తం డీల్ విలువను సుమారు రూ.9,416 కోట్లుగా అంచనా వేశారు.

మ్యాక్స్​ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌లోని షేర్లను 2018లో  రేడియంట్‌‌‌‌తో పాటు కేకేఆర్ ఒక్కొక్కటి రూ.80 చొప్పున కొనుగోలు చేశాయి. పోయిన ఏడాది జూన్ నాటికి, కయాక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్​కు మ్యాక్స్ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌లో 45.63 కోట్ల షేర్లు లేదా 47.24 % వాటా ఉంది. 2021 సెప్టెంబర్ 29న కంపెనీ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 8.44 కోట్ల షేర్లను రూ.2,956 కోట్లకు అమ్మింది. షేర్లను హెచ్‌‌‌‌డిఎఫ్‌‌‌‌సి మ్యూచువల్ ఫండ్, వెరిటాస్ ఫండ్స్ పిఎల్‌‌‌‌సి  ఎస్‌‌‌‌బిఐ మ్యూచువల్ ఫండ్‌‌‌‌లు దక్కించుకున్నాయి. కేకేఆర్​-అనుబంధ సంస్థ 2022 మార్చి లో కంపెనీలోని మరో 10 % వాటాను దాదాపు రూ. 3,300 కోట్లకు ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్, పెన్షన్ ఫండ్ గ్లోబల్  స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్​కు అమ్మింది.