యాదగిరిగుట్ట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని వనమామలై పీఠాధిపతి మధురకవి వనమామలై జీయర్ స్వామి గురువారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన జీయర్ స్వామికి ఆలయ ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతికి నారసింహుడి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం చేశారు. అనంతరం పండితగోష్టి నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి, మాజీ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.
