వెలుగు టోర్నీ : మెగా ఫైనల్ నేడే

వెలుగు టోర్నీ : మెగా ఫైనల్ నేడే

హైదరాబాద్ : నెల రోజుల నుంచి జరుగుతున్న వెలుగు టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్ కు చేరింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో.. మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ టీమ్స్ ఫైనల్స్ కు దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలో ఇవాళ.. టైటిల్ ఫైట్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాని చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నారు.

బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వెలుగు క్రికెట్ టోర్నీ సెమీఫైనల్స్ జరిగాయి. మ్యాచ్ లను పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ ప్రారంభించారు. తొలుత నిజామాబాద్ అర్బన్ వర్సెస్ కొత్తగూడెం మధ్య తొలి సెమీస్ ఫైట్ జరిగింది. 9 వికెట్ల తేడాతో కొత్తగూడెం జట్టును ఓడించి.. ఫైనల్ చేరింది నిజామాబాద్ అర్బన్ టీమ్. మొదట బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం 9 వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన నిజామాబాద్ అర్బన్.. 16 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేధించింది. 4 వికెట్లతో చెలరేగిన బౌలర్ గిరీష్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

రెండో సెమీస్ లో… మహబూబ్ నగర్, రామగుండం టీమ్స్ తలపడ్డాయి. పాలమూరు బౌలర్ అరుణ్.. 5 వికెట్లతో విజృంభించడంతో.. రామగుండం 10 ఓవర్లలో 17 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాలమూరు.. 3 ఓవర్లలోపే టార్గెట్ ఛేజ్ చేసేశారు. ఉమ్మడి కరీంనగర్ స్థాయిలో.. జిల్లా చాంపియన్ గా నిలిచిన రామగుండం.. సెమీస్ లో ఘోరంగా విఫలమైంది. తన బౌలింగ్ తో.. మెరుపు ప్రదర్శన చేసిన మహబూబ్ నగర్ టీమ్ అరుణ్ కు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీతో.. గ్రామీణ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫైనల్స్ చేరిన మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ జట్లకు.. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నీలో.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు.. భవిష్యత్ లో మంచి ట్రైనింగ్ ఇప్పించి రాష్ట్రస్థాయిలో ఆడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయంలో వెలుగు దినపత్రిక ముందుంటుందని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో  గురువారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హాజరుకానున్నారు. టైటిల్ విన్నర్ కు బహుమతులు అందజేయనున్నారు.