వరద సాయం కొందరికేనా!..కేటీఆర్​ ఎదుటే కుర్చీల ధ్వంసం

వరద సాయం కొందరికేనా!..కేటీఆర్​ ఎదుటే కుర్చీల ధ్వంసం
  • మంత్రిని నిలదీసిన ముంపు బాధితులు
  • 10వేల సాయం ఒకరిద్దరికే ఇవ్వడంపై ఆగ్రహం
  • అర్ధంతరంగా వెళ్లిపోయిన కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి

మేడిపల్లి, సికింద్రాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలు ఫొటోలకు పోజులిచ్చేందుకే చేస్తున్నారా అని బాధితులు నిలదీశారు. ఇండ్లు నీట మునిగిన కాలనీల్లో ఆర్భాటంగా సభలు పెట్టి.. అందరిని పిలిచి.. ఒకరిద్దరికి మాత్రమే ఆర్థిక సాయం అందివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని బుధవారం మంత్రి మల్లారెడ్డి, మేయర్, లోకల్​ టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లిలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆర్థిక సాయం అందిస్తారని చెప్పడంతో చాలామంది వచ్చారు. కార్యక్రమానికి మంత్రి లేటుగా రావడంతో వచ్చిన వాళ్లంతా అప్పటికే అసహనానికి గురయ్యారు. వచ్చిన మంత్రి కేటీఆర్ ఇద్దరు మహిళలను సభా ప్రాంగణం నుంచి  కొంతం దూరంగా పిలిచి వారికి చెక్కులు ఇస్తూ ఫొటోలు దిగారు. అందరికి  ఆర్థిక సాయం అందిస్తామని పిలిచి.. మంత్రి ఒకరిద్దరికే ఇవ్వడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసమేనా మమ్మల్ని పిలిచిందని నిలదీశారు. కేటీఆర్, సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేజీపై కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. బాధితుల్లో కోపం అంతకంతకు పెరుగుతుండడంతో కేటీఆర్​, మల్లారెడ్డి తమ పర్యటన అర్ధంతరంగా ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తార్నాకలో కూడా..

తార్నాక డివిజన్ లాలాపేట చంద్రబాబునాయుడు బస్తీలో పర్యటన సందర్భంగా కూడా మంత్రి కేటీఆర్​కు బాధితుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, స్థానిక కార్పొరేటర్ సరస్వతితో కలిసి మంత్రి కేటీఆర్ బస్తీలో కొంత మందికి నగదు అందజేసి అక్కడ నుంచి బయల్దేరారు. అయితే స్థానికులు కొందరు కాన్వాయ్​కి అడ్డం వచ్చి మా సమస్యలు వినాలని కోరడంతో కేటీఆర్ కారు దిగి వచ్చారు. ‘ఇండ్లలో నీళ్లు చేరి వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నాము…  మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేరు.. మీరైనా చూడండి’ అని అడిగారు. ఇంజనీర్లను పంపించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి వారికి చెప్పారు. ‘అందరు నాయకులు ఇట్లనే చెప్తున్నరు… ఆఫీసర్లను ఎప్పుడు పంపిస్తారో చెప్పండి’ అని వాళ్లు మంత్రిని అడిగారు. దీంతో అసహనానికి గురైన కేటీఆర్ ఇపుడే కదా సమస్య తెలిసింది….వెంటనే పరిష్కరించమంటే ఎలా..? అన్నారు. ఈ బస్తీలోని వాంబే ఇండ్లను కూల్చివేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి అందరికి ఇస్తామని చెప్పారు.