ఆ డ్ర‌గ్స్ కంపెనీని తొలగించండి.. మా ప్రాణాల‌ను కాపాడండి

ఆ డ్ర‌గ్స్  కంపెనీని తొలగించండి.. మా ప్రాణాల‌ను కాపాడండి

శంషాబాద్ ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌ల ఆవేద‌న‌

త‌మ ప్రాంతంలోని డ్ర‌గ్స్ కంపెనీ వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పెద్దగోల్కొండ, బహదూర్ గూడ గ్రామాల‌ ప్ర‌జ‌లు. శంషాబాద్ లోని శ్రీకృష్ణ డ్రగ్స్ కంపెనీ నుండి వెలువడే కెమికల్ నీరు వల్ల త‌మ గ్రామాల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై పోయాయని వారు వాపోయారు. వేసిన పంట పూర్తిగా చనిపోతుందని, ఆ నీరు త్రాగడం వ‌ల్ల త‌మ‌ ఆయుష్షు తగ్గిపోతుందని అంటున్నారు. మూగ‌జీవాలైన ఆవులు, గేదేలు ఈ నీటి వ‌ల్ల‌ చనిపోతున్నాయని, తాము చావు బ్రతుకులతో పోరాడుతున్నామని త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.

ఈ నీటివ‌ల్ల‌ గతంలో పంటలు నష్టపోయిన వాళ్లకు సంవత్సరానికి.. ఇంత అని కాస్త పరిహారం అందజేసేవారని.. ఇప్పుడు కొంతమందికి మాత్ర‌మే పరిహారం ఇస్తూ మరికొందరిని విస్మరిస్తున్నారని అన్నారు గ్రామ‌స్తులు. అయినా త‌మ‌కు ఆ డ్ర‌గ్స్ కంపెనీ వారు ఇచ్చే పరిహారం అవసరం లేదని, త‌మ గ్రామం నుండి కంపెనీని పూర్తిగా తొలగించి… త‌మ ప్రాణాలు,‌ పొలాలు, మూగజీవాలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్రాగడానికి , వ్య‌వ‌సాయానికి కృష్ణా నీరు ఇవ్వని ప్రభుత్వం శ్రీకృష్ణ డ్రగ్స్ కంపెనీలకి స్పెషల్ గా పైప్ లైన్ వేయించి మరి మంచినీరు అందిస్తున్నారని గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. గ్రామప్రజలు కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కంపనీ యజమానులకు సహాయసహకారాలు పుష్కలంగా అందిస్తుందని మండిప‌డ్డారు.