కాకా వల్ల 75వేల కుటుంబాలు బాగుపడ్డై : వివేక్ వెంకటస్వామి

కాకా వల్ల 75వేల కుటుంబాలు బాగుపడ్డై : వివేక్ వెంకటస్వామి

1992 ఆర్థిక సంక్షోభం సమయంలో కేంద్రంతో పోరాడి గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ రూ.25,000  కోట్లకు పెంచేలా చేసిన ఘనత తన తండ్రి వెంకటస్వామి సొంతమని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ సెక్టార్లో పెన్షన్ అమలయ్యేందుకు వెంకటస్వామి కారణమని చెప్పారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకా వల్ల 75 వేల కుటుంబాలు బాగుపడ్డాయని, ఆయన చూపిన మార్గంలో నడిచి కాకా కలలు సాకారం చేసే ప్రయత్నం చేస్తున్నామని వివేక్ స్పష్టం చేశారు. 

పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు..

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తన తండ్రి వెంకటస్వామి కాకా అంబేడ్కర్ ఇన్ స్టిట్యూషన్ ఏర్పాటు చేసినట్లు వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఉర్దూ మీడియంలో పదో  తరగతి వరకు చదివిన తన తండ్రి ఇంగ్లీష్ నేర్చుకోవాలని తాపత్రయపడేవారని, తనలా అవకాశం దొరకని వారి కోసం ఈ విద్యా సంస్థ నెలకొల్పారని అన్నారు. ప్రస్తుతం 5వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని వివేక్ చెప్పారు. 

స్టూడెంట్స్కు స్టేట్ ర్యాంకులు 

కాకా అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో చదువుకున్న విద్యార్థుల్లో పలువురు స్టేట్ ర్యాంకులు సాధించారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, క్రమశిక్షణ, విద్యార్థులు, ఫ్యాకల్టీ తోడ్పాటు వల్ల కళాశాలకు ఇంత మంచి పేరు వచ్చిందని అన్నారు. 50 ఏండ్ల క్రితం ప్రారంభించిన ఈ విద్యా సంస్థలో చదువుకున్న వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు.