పదేండ్లవుతున్నా పరిహారం అందించరా?

పదేండ్లవుతున్నా పరిహారం అందించరా?

జగిత్యాల, వెలుగు: కేసీఆర్ సర్కారుకు మేఘా కంపెనీపై ఉన్న ప్రేమ ప్రాజెక్టుల కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసితులపై లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చేగ్యాం గ్రామంలోని సర్కార్ బడిలో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం వెల్గటూర్ మండలంలో కోటిలింగాల, మొక్కట్రావుపేట్, రాంనూర్, చేగ్యాం, తాళ్ల కొత్తపేట, ఉండేడా గ్రామాల ప్రజలు ఇండ్లు, పొలాలు త్యాగం చేశారని, వారికి మంత్రి కొప్పుల హామీలు ఇవ్వటమే తప్ప పరిహారం ఇప్పించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. రూల్ ప్రకారం18 ఏండ్లు నిండిన యువతీయువకులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారాన్ని పెండింగ్​లో పెట్టారన్నారు. పదేండ్లు అయినా వారికి పరిహారం అందించకపోవడంపై వివేక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తప్ప కేసీఆర్ సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలన్నారు. నిధులున్నా కలెక్టర్ తో పని చేయించలేని దద్దమ్మ మంత్రి కొప్పుల అని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు లాక్కొని గోదావరి నీళ్లను సిద్దిపేట, గజ్వేల్​కు తరలిస్తున్నారని, ఇక్కడి రైతాంగానికి మాత్రం సాగు నీరు ఇవ్వడంలేదన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎండాకాలం వస్తే సాగు నీరు కోసం రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉందన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికార మదంతో వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎల్లంపల్లి భూ నిర్వాసిత గ్రామాలకు బీజేపీ తరుఫున అండగా ఉంటామని, అవసరమైతే పోరాటం చేసి న్యాయం చేస్తామన్నారు.  

ఇండ్లు మునిగి చెట్లకింద ఉంటున్నం.. 

ఇండ్లు నీళ్లలో మునిగి చచ్చిపోతున్నా సర్కార్ పట్టించుకుంటలేదని, సర్కార్ బడిలో క్లాసులు అయిపోయేదాక చెట్లకింద ఉంటున్నామని చేగ్యాం గ్రామానికి చెందిన ముంపు బాధితులు వివేక్ వెంకటస్వామి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి కొప్పుల ఆ తర్వాత మళ్లీ తమ గ్రామానికి రాలేదని, తమ బాధలు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. తమను బలవంతంగా స్థానిక బడికి తరలించారని, ఆ తర్వాత ఆఫీసర్లు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ నడుస్తున్న సమయంలో చెట్లు, పుట్టల వద్ద ఉంటున్నామని, స్కూల్ అయ్యాక వచ్చి తలదాచుకుంటున్నామని చెప్పారు. దీంతో బాధితులకు న్యాయం చేయాలని జగిత్యాల కలెక్టర్ రవితో వివేక్ ఫోన్​లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు నెలల్లో రీసర్వే చేసి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.