ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్​

ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్​
  • ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్​
  • 30 దాకా అభ్యంతరాల స్వీకరణ
  • జనవరి 5న తుది జాబితా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 3 కోట్ల 35 లక్షల 60 వేల 982 మంది ఓటర్లున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ముసాయిదాను సీఈఓ శశాంక్​గోయల్​సోమవారం ప్రకటించారు. ఈ నెల 30 దాకా అభ్యంతరాలు స్వీకరిస్తాం. డిసెంబర్ 20 దాకా వాటిని పరిశీలించి పరిష్కరిస్తాం. జనవరి 5న తుది జాబితా సిద్ధమవుతుంది” అని వివరించారు. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో 1,52,57,665 మంది పురుష ఓటర్లుండగా మహిళ ఓటర్లు 1,50,97,292 మందున్నారు. 1,683 థర్డ్ జెండర్, 14,501 సర్వీస్​ ఓటర్లు, 2,742 ఎన్నారై, 5,01,836 పీడబ్ల్యూడీ ఓటర్లు తదితరులున్నారు. ముసాయిదాపై సోమవారం సీఈఓ ఆల్​పార్టీ మీటింగ్​జరిపి సలహాలు, సూచనలపై చర్చించారు.
హౌస్​ నంబర్ సెర్చ్​ ఆప్షన్: కాంగ్రెస్
ముసాయిదా సరిగా లేదని కాంగ్రెస్ ​సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డి అన్నారు. ‘‘2018 దాకా ఇంటి నంబర్ ద్వారా పేరు సెర్చ్ చేసుకోవడం వీలయేది. ఇప్పుడా ఆప్షన్ తీసేశారు. అది మళ్లీ పెట్టాలి. బూత్​లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) ఫోన్ నంబర్లను ఓటర్లకు అందుబాటులో ఉంచాలి” అని కోరినట్టు మీడియాకు చెప్పారు. హుజూరాబాద్ పోలింగ్ కు వీవీ ప్యాట్ల తరలింపులో గోల్ మాల్ జరిగిందన్న వార్తలపై స్పష్టత అడిగితే ఏమీ చెప్పలేదని కాంగ్రెస్​నేత నిరంజన్​రెడ్డి అన్నారు.
ఓటర్ల సంఖ్య మేరకు బూత్​లు: బీజేపీ
పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయాలని బీజేపీ నేత ఎస్​మల్లారెడ్డి సూచించారు. ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నా బూత్ లు తక్కువున్నాయని ఉదాహరించారు.
ఓటర్లకు ఎస్ఎంఎస్: టీడీపీ
ఓటర్ల నమోదప్పుడు భారీగా మార్పు చేర్పులు, తొలగింపులు జరుగుతాయని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. కాబట్టి ప్రతి ఓటర్ కూ మొబైల్ ద్వారా  ఎస్ఎంఎస్ పంపాలని కోరినట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో సమతుల్యత పాటించాలన్నారు. జనవరి 5 లోపు పార్టీలతో మళ్లీ సమావేశమవాలని కోరిన్టటు చెప్పారు.