ఓటర్లకు హ్యాండ్ గ్లవ్స్, నామినేషన్‌లు ఆన్‌లైన్‌లో.. బిహార్‌‌ ఎన్నికలకు ఈసీ గైడ్‌లైన్స్‌

ఓటర్లకు హ్యాండ్ గ్లవ్స్, నామినేషన్‌లు ఆన్‌లైన్‌లో.. బిహార్‌‌ ఎన్నికలకు ఈసీ గైడ్‌లైన్స్‌

న్యూఢిల్లీ: బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కరోనా విజృంభిస్తున్నందున ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈసీఐ డేటా ప్రకారం.. ఈవీఎంల్లో ఓట్లు వేయడానికి ముందు ఓటర్లకు హ్యాండ్ గ్లోవ్స్ ఇస్తారు. అలాగే ఫేస్ మాస్కులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. శానిటైజర్‌‌ను కూడా అందుబాటులో ఉంచుతుంది. ఓటర్లు గ్లోవ్స్ వేసుకుని, ఫేస్‌ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడుతూ ఓట్లు వేసేలా పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకోనుంది. ఓటర్లను గుర్తు పట్టే సమయంలో వాళ్లు తమ ఫేస్ మాస్కులను కిందకు దించాల్సి ఉంటుంది.

క్వారంటైన్‌లో ఉన్న వారూ ఓటేయొచ్చు
ప్రతి పోలింగ్ బూత్‌ ఎంట్రన్స్ వద్ద థర్మల్ స్కానర్స్‌ను ఏర్పాటు చేసేలా ఈసీ చర్యలు చేపట్టనుంది. కరోనా లక్షణాలు కలిగిన సింప్టమిక్ పేషెంట్స్‌ను బూత్‌ల్లోకి రాకుండా చూసే పనులను ఆశా కార్యకర్తలు, పారామెడిక్స్‌, బూత్ స్టాఫ్‌కు అప్పగించారు. పోటీపడే అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్‌ఏ) నిబంధనలను పాటిస్తూ చేసుకోవచ్చని పేర్కొంది. డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ చేసే వ్యక్తుల సంఖ్యను ఐదుకు కుదించింది. కరోనా పాజిటివ్‌గా తేలి క్వారంటైన్‌లో ఉన్న వారు పోలింగ్ రోజు చివరి గంటలో, హెల్త్ అఫీషియల్స్ పర్యవేక్షణలో ఓట్లు వేయాలని ఈసీ వివరించింది. బిహార్‌‌లో 2015 ఎన్నికలకు 6.62 కోట్ల పైచిలుకు నమోదైన ఓట్లర్లు ఉన్నారు. కొత్తగా మరో 15.35 లక్షల ఓటర్లు వీరికి జత కానున్నారు. బిహార్‌‌లో 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.