టీచర్లు, హెడ్మాస్టర్లు ఏ కేడర్?

టీచర్లు, హెడ్మాస్టర్లు ఏ కేడర్?
  • స్కూల్ టీచింగ్ స్టాఫ్ కేడర్‌‌ను తేల్చని సర్కార్ 
  • చట్టపరమైన సమస్యలే కారణమంటున్న అధికారులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్ల కేడర్​ విభజన చేసిన ప్రభుత్వం, సర్కారు స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్ల కేడర్‌‌ను మాత్రం తేల్చలేదు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల విభజన అసంపూర్తిగానే మిగిలింది. లీగల్ ప్రాబ్లమ్స్​తోనే ఈ ప్రాసెస్ ఆగిందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ఇష్యూ తేలితేనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల అంశం తేలనుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో సర్కార్, లోకల్ బాడీ స్కూళ్లలో 1.08 లక్షల మంది టీచర్లు, హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. వీరిలో ఎస్‌‌‌‌‌‌‌‌జీటీలు 50 వేలు, స్కూల్ అసిస్టెంట్లు 40 వేలు, హెడ్మాస్టర్లు 5,800 మంది కాగా..మిగిలిన వారంతా లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలు. స్కూల్ ఎడ్యుకేషన్​ కేడర్ విభజన చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో158 రిలీజ్ చేశారు. ఇందులో ఎంఈఓ కేడర్, ఆపై కేడర్, నాన్ టీచింగ్ స్టాఫ్ కేడర్‌‌ను తేల్చిన సర్కారు.. టీచర్లు, హెడ్మాస్టర్ల కేడర్‌‌ను పేర్కొనలేదు. వీటితో పాటు మోడల్ స్కూళ్లలో 3,880 పోస్టులు(పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్) ఉండగా, వాటి కేడర్‌‌ను కూడా తేల్చలేదు. కేజీబీవీ, సొసైటీ గురుకులాల్లోనూ ఇదే సమస్య ఉన్నది. అయితే మోడల్ స్కూళ్ల పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులు మల్టీ జోనల్, టీజీటీ పోస్టులు జోనల్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశముంది. ఎస్‌‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా కేడర్ పోస్టులుగా, హెడ్మాస్టర్లను మల్టీ జోనల్ పరిధిలో చేర్చే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.  
లీగల్ సమస్యలతో పక్కన పెట్టిన్రు  
గవర్నమెంట్, లోకల్ బాడీ టీచర్ల మధ్య సర్వీస్ రూల్స్​విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఏకీకృత సర్వీస్​రూల్స్​కు రాష్ట్రపతి ఆమోదం తెలిపినా, హైకోర్టు దాన్ని కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. దీంతో కేడర్ విభజన సమస్యగా మారింది. ప్రస్తుతం ఎంఈఓ, ఆపై పోస్టులన్నీ గవర్నమెంట్ పోస్టులు కావడంతో, వాటికి ఎలాంటి సమస్య లేదనే కేడర్ లిస్టులో పొందుపర్చినట్టు తెలుస్తోంది. మిగిలిన పోస్టుల్లో లోకల్ బాడీ, గవర్నమెంట్ కలిపి ఉండటంతో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశముంది. సమస్య పరిష్కారానికి సర్కారు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప, ఇది ఇప్పట్లో తేలదని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. వెంటనే వీటిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాయి.