లీడర్ కౌన్?.. విపక్షాల కూటమికి చైర్మన్ ఎవరు..?

లీడర్ కౌన్?..   విపక్షాల కూటమికి చైర్మన్ ఎవరు..?

బెంగళూరు: విపక్ష కూటమికి చైర్మన్ ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీని కూటమి చైర్మన్ గా చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. తమకు అవకాశం ఇవ్వాలని బీహార్ సీఎం నితీశ్​ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కూటమి పేరునూ మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు సోనియా గాంధీ చైర్ పర్సన్ గా ఉన్నారు. 

ఈ కొత్త కూటమికి ఏం పేరు పెడతారు.. అనేది రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు బెంగళూరులో 26 పార్టీలకు చెందిన నేతలు సమావేశమవుతున్నారు. 80 మంది నాయకులు పాల్గొనే ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

ఇవాళ సాయంత్రం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం నుంచి కీలక అంశాలపై చర్చిస్తారు. పాట్నా సమావేశానికి 15 పార్టీలు మాత్రమే హాజరవగా ఈ సారి వాటి సంఖ్య పెరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలన్నీ ఈ మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాట్నా సమావేశానికి హాజరై.. ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని కోరారు. 

ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తేనే కలిసి వస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఆప్ డిమాండ్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో ఇదే కూటమిలో ఆప్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయం కారణంగా సమావేశానికి రావడం లేదని సమాచారం పంపారు. 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రియా సూలే కూటమి సమావేశానికి హాజరవుతున్నారు. ఎన్సీపీ చీలిక వర్గం నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాత్రం ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడబోయే కూటమిని అవకాశవాద కలయికగా బీజేపీ అభివర్ణిస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడం అసాధ్యమని పేర్కొన్నది. 

ఈడీ, సీబీఐ కేసులున్న పార్టీలు ఒక్కటయ్యాయని, వాటి కామన్ ఎజెండా మోదీని గద్దె దించడమేనని, అది సాధ్యమయ్యే పని కాదనిపేర్కొంటోంది. 2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రోడ్ మ్యాప్ సిద్ధమవుతుండటం విశేషం. 26 పార్టీలు కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవడం, కామన్ ఎజెండాను రూపొందించి ప్రచారం చేయడం సాధ్యమా..? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. అంతర్గత కుమ్ములాటలు లేకుండా చివరిదాకా కూటమి పార్టీలు నడుస్తాయా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.