
కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాష్ట్ర ప్రజల బతుకులను బుగ్గిపాలు చేశారని, ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించి మోసం చేశారని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పదేండ్లుగా దౌర్జన్యాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం పని చేశారని బీఆర్ఎస్ లీడర్లు మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. అంబేద్కర్ దళితులకు కల్పించిన సమానత్వం, రిజర్వేషన్లు రద్దయ్యేలా ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన బీజేపీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేసిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ కూడా మోసం చేసిండన్నారు. సింగరేణిని కేసీఆర్ ఒక ఏటీఎం మాదిరిగా వాడుకున్నాడని వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. సింగరేణికి రూ. 25 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా సంస్థను నష్టాల్లోకి నెట్టిండన్నారు. కేసీఆర్, మోదీ కలిసి సింగరేణిలోని కొన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు అప్పగించారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం గత పదేండ్లలో కమీషన్ల కోసమే పని చేసిందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. తనను చిన్న కొడుకుగా భావించి ఎంపీగా గెలిపించాలని కోరారు.