ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న సంయుక్త దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో 48 మంది ఇరాన్ నేతలను ఒకేసారి హతమార్చామని ట్రంప్ ప్రకటించారు. 48 మంది నేతలను ఏక కాలంలో అంతమొందించామని.. అంతా చాలా త్వరత్వరగా జరిగిపోయిందని ట్రంప్ చెప్పారు. ఇంత త్వరగా తాము విజయం సాధించామని.. మా విజయాన్ని ఎవరూ నమ్మలేకపోయారని ట్రంప్ తెలిపారు.
ఇదంతా తాము తమ కోసం మాత్రమే చేయలేదని.. ప్రపంచం కోసం చేశామని ఇరాన్పై దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. అంతా మంచే జరుగుతుందని.. ఆందోళన అక్కర్లేదని ట్రంప్ చెప్పడం గమనార్హం. షెడ్యూల్ కంటే ముందే టార్గెట్ రీచ్ అయ్యామని ట్రంప్ చెప్పారు. అమెరికన్ వైమానిక దళం ఇటీవల ఇరాన్‌పై జరిపిన దాడులలో నాలుగు B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది. భూగర్భ బాలిస్టిక్ క్షిపణి ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది.
ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లోని మొత్తం 31 ప్రావిన్స్‌లకుగాను 24 ప్రావిన్స్‌లపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. 200 మందికి పైగా మృతి చెందారని, 747 మంది గాయపడ్డారని ఇరానియన్ రెడ్ క్రీసెంట్ సంస్థ వెల్లడించింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇదే కావడం గమనార్హం.
