అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపింది కేంద్రం. ఈ మేరకు మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఓ లేఖ విడుదల చేసిందని... ఇకపై గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్ లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఇండియా వచ్చేందుకు వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. దుబాయి నుండి మస్కట్ ఎయిర్ పోర్టు వరకు రావాలంటే రోడ్డు మార్గాన 450 కి.మీలు ప్రయాణించాలని... అలాగే ఇతర గల్ఫ్ దేశాల నుండి మస్కట్ కు రోడ్డు మార్గాన రావాలంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలని అన్నారు.
- అలా మస్కట్ కు చేరుకున్న వారంతా ఒమన్‌లోకి ప్రవేశించడానికి ముందుగానే విజిట్, టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి. ప్రయాణికులు రాయల్ ఒమన్ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ముందుగా ఈ-వీసాకు దరఖాస్తు చేయాలని తెలిపింది ఇండియన్ ఎంబసీ.
- అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతి ఉన్న భారత పాస్‌పోర్ట్ దారులకు ఆన్-అరైవల్ వీసా సదుపాయం ఉందని... వారు రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా ఉన్నట్లయితే ముందస్తు వీసా లేకుండా గరిష్టంగా 14 రోజుల వరకు ఒమన్‌లో ప్రవేశించవచ్చని తెలిపింది.
- గల్ఫ్ సహకార మండలి దేశాలు అయిన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నివసిస్తూ చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డ్ కలిగిన భారత పౌరులకు కూడా ఆన్-అరైవల్ వీసా అందుబాటులో ఉంటుందని పేర్కొంది ఇండియన్ ఎంబసీ.
- వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని తెలిపింది.
- భారత్ కు తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులంతా ఏదైనా సమాచారం కావాలంటే ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ ఆఫీసును సంప్రదించాలని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
