కాంగ్రెస్ ప్రచారానికి అన్నీ తానై.. హోరెత్తించిన రేవంత్

కాంగ్రెస్ ప్రచారానికి అన్నీ తానై.. హోరెత్తించిన రేవంత్
  •       బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను దీటుగా ఎదుర్కొన్న సీఎం
  •     ‘గాడిద గుడ్డు’తోనూ జోరుగా సాగిన ప్రచారం

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌సభ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్​లు, రోడ్ షోలు నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్​కు మంచి ఊపును తీసుకువచ్చారు. బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌కు దీటుగా ప్రచార సభలు నిర్వహించారు. బాధ్యతలన్నీ తన భుజస్కందాలపై వేసుకొని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్రంలో14 ఎంపీ సీట్లు సాధించడమే టార్గెట్​గా రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్ సాగించారు. గత నెల 6న తుక్కుగూడ జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన రేవంత్.. ఒక రోజులో వివిధ నియోజకవర్గాల్లో 4 మీటింగ్​లలో కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌‌గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి కొన్ని ఎన్నికల ప్రచార సభలకు కూడా రేవంత్ హాజరయ్యారు. 

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం 

రేవంత్‌‌రెడ్డి వాగ్ధాటిని, ప్రజలలో ఆయనకున్న ఇమేజ్‌‌ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాలలో సైతం ఆయనతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. పార్టీ నిర్ణయం మేరకు కేరళ, కర్నాటకలోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు.  ఉత్తరప్రదేశ్‌‌ రాయ్ బరేలిలో రాహుల్‌‌గాంధీ నామినేషన్‌‌ కార్యక్రమానికి సైతం రేవంత్ హాజరయ్యారు. ఏపీలోని వైజాగ్ లో కూడా కాంగ్రెస్‌‌ తరఫున సభలో పాల్గొన్నారు. ప్రచారం మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 

‘రిజర్వేషన్ల రద్దు’ అంశంతో బీజేపీకి షాక్   

కేసీఆర్‌‌పైనా, మోదీపైనా.. వారి పాలనా వైఫల్యాలపైనా పదునైన అస్త్రాలు సంధించి ఓటర్లలో రేవంత్‌‌రెడ్డి చైతన్యం తెచ్చారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టం గురించి ఆయన చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. దీనిపై చివరకు మోదీ, అమిత్‌‌షా నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు అందరూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.   

‘గాడిద గుడ్డు’తో వినూత్నంగా క్యాంపెయిన్ 

ప్రధాని మోదీ కాంగ్రెస్‌‌పై చేసిన విమర్శలకు సైతం రేవంత్ దీటుగా బదులిచ్చారు. పదేండ్ల బీజేపీ పాల నలో.. రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం వంటి వాటిని బలంగా ఎత్తి చూపారు. రాష్ట్రానికి బీజేపీ ‘‘గాడిద గుడ్డు’’ తప్ప ఏమీ ఇవ్వలేదంటూ వినూత్నంగా ప్రచారం చేపట్టి.. ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఆగస్టు15లోపు తప్పనిసరిగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని భరోసా ఇవ్వడం కూడా హైలైట్‌‌గా నిలిచింది. ఎలాగూ బీఆర్‌‌ఎస్‌‌ తమకు పోటీనే కాదని, ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌‌ మధ్యనే జరుగుతున్నాయని చెప్పిన రేవంత్.. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. తద్వారా రాష్ట్రంలో తన టార్గెట్14 సీట్లను కాంగ్రెస్‌‌ గెల్చుకుంటుందనే ధీమాను పార్టీ నేతలు, కార్యకర్తల్లో కల్పించగలిగారు.

ఇండియా కూటమిని గెలిపించి రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలి: సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి.. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన దేశం బీజేపీ కుట్రలకు బలవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ప్రచారం చివరి రోజైన శనివారం ఆయన మీడియాకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎందరో డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా ఎదిగారు.  ఆయా వర్గాల్లో వారి అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగం ఎంతో  దోహదపడింది. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్లరహిత దేశంగా మార్చాలని  ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.