హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ యాక్టును అనుసరించి ఆఫీసర్లు జారీచేసే ఉత్తర్వులను సవాలు చేసే అప్పీళ్లను విచారించేందుకు రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ) ఏర్పాటైంది. ఇది రాష్ట్రంలో ఏర్పాటైన జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ కావడం గమనార్హం. హైదరాబాద్ బెంచ్‌కు ముగ్గురు జడ్జిలను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషీయల్ సభ్యులుగా సుశీల్ కుమార్ శర్మ, ఏపీ రవి, టెక్నికల్ సభ్యుడిగా డాక్టర్ డీకే శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు నాలుగేండ్లు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
జీఎస్టీ చట్టం ప్రకారం.. అధికారులు లేదా చట్టం కింద రివిజనల్ అధికారులు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీళ్లను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. జీఎస్టీఏటీ ప్రధాన ధర్మాసనం ఢిల్లీలో ఉంది. రాష్ట్రాల్లో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. జీఎస్టీ ట్రిబ్యునల్‌గా ఇప్పటివరకు కమిషనర్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు అప్పీల్స్ హైకోర్టు విచారణ చేసింది. ఇకపై అప్పీలేట్ ట్రిబ్యునల్ విచారణ చేయనుంది.
