రేషన్‌‌ కార్డుల టెండర్పై పిటిషన్‌‌ కొట్టివేత ..టెండరు ప్రక్రియలో న్యాయ సమీక్ష పరిమితం:హైకోర్టు

రేషన్‌‌ కార్డుల టెండర్పై పిటిషన్‌‌ కొట్టివేత ..టెండరు ప్రక్రియలో న్యాయ సమీక్ష పరిమితం:హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: టెండర్లకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో న్యాయసమీక్ష పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది. రేషన్‌‌ టెండర్లకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌‌ను కొట్టివేసింది. 

క్యూ ఆర్‌‌ కోడ్‌‌తో కూడిన రేషన్‌‌ కార్డుల తయారీకి సంబంధించి సాంకేతిక బిడ్‌‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రోస్మెర్టా టెక్నాలజీస్‌‌ లిమిటెడ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ టి.మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..95.56 లక్షల స్మార్ట్‌‌ రేషన్‌‌ కార్డులను కొత్తగా తయారు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

కార్డుల తయారీకి గతేడాది మార్చిలో ప్రభుత్వం టెండరు జారీ చేసిందన్నారు. సాంకేతిక బిడ్‌‌ను తిరస్కరించిందన్నారు. ఇతరులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికే సాంకేతిక బిడ్‌‌ను తిరస్కరించిందని ఆరోపించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ..డిజిటల్‌‌ రేషన్‌‌ కార్డు వివరాలను తక్షణం తెలుసుకునేలా ఎన్‌‌క్రిప్ట్‌‌డ్‌‌ క్యూఆర్‌‌ అప్లికేషన్‌‌ను సమర్పించడంలో పిటిషనర్‌‌ విఫలమయ్యారని తెలిపారు. 

సాంకేతిక అర్హత లేకపోవడంతో బిడ్‌‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ..టెండరు ఖరారులో పక్షపాతం చూపినట్లు ఆధారాలు లేవని తెలిపింది. అంతేగాకుండా సాంకేతికమైన టెండర్ల వ్యవహారాల్లో న్యాయసమీక్ష అధికారం పరిమితమన్న సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో టెండరులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అనంతరం పిటిషన్‌‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.