న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాజ్య సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇరాన్ యుద్ధాన్ని ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని.. భారతీయుల భద్రత మా తొలి ప్రాధాన్యత అని చెప్పారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన 2026, మార్చి 1న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశమైందని.. ఇరాన్‌లో జరిగిన వైమానిక దాడులు, ఆ తర్వాత అనేక గల్ఫ్ దేశాలలో జరిగిన దాడుల గురించి ప్యానెల్‌కు వివరించామని తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని.. అన్ని వైపులా సంయమనం పాటించాలని కోరామని తెలిపారు.
ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యం కొనసాగించాలని ఇప్పటికీ విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. ఇక, మన ఇంధన అవసరాల విషయంలో పశ్చిమాసియా కీలకమని.. క్రూడాయిల్ ధరల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. టెహ్రాన్‌లోని భారతీయులకు ఇది వరకే అడ్వైజరీ జారీ చేశామన్నారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిగా పనిచేస్తుందని, అక్కడ చిక్కుకున్న విద్యార్థులకు సహాయం చేస్తుందని తెలిపారు.
ఇప్పటికే అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎంబసీ సహాయపడిందని.. ఖతార్, జోర్డాన్ వంటి దేశాలలో చిక్కుకున్న భారతీయులకు సహాయం చేయడానికి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కొచ్చి ఓడరేవులో ఇరాన్ నావికాదళ నౌక ఐరిస్ లావన్‌కు ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.
