30 వేల మంది తొలగింపు అనేది అబద్ధం: క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా...

 30 వేల మంది తొలగింపు అనేది అబద్ధం: క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా...

టెక్ మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత ఉండబోతోందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కంపెనీ స్పందించింది. దాదాపు 30 వేల మందిని తీసేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.

అసలేం జరిగిందంటే.... గత కొన్ని రోజులుగా ఎక్స్  వంటి సోషల్ మీడియాలో టెక్ మహీంద్రాపై రకరకాల పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం వల్ల కంపెనీ  ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకోబోతోందని, సుమారు 30 వేల మందిని ఇంటికి పంపుతున్నట్లు ఈ పోస్ట్‌లో ఉంది. 

ఈ పుకార్లు కాస్తా ఎక్కువ కావడంతో టెక్ మహీంద్రా సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక లేఖ రాసింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన ప్రస్తుతానికి కంపెనీకి లేదని, ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం టెక్ మహీంద్రాలో ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల మంది పనిచేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పులు లేవని కంపెనీ తెలిపింది.  పని పూర్తయిన ప్రాజెక్టుల నుంచి ఉద్యోగులను తీసేయడం లేదని, వారిని కొత్త ప్రాజెక్టుల్లోకి మారుస్తున్నామని స్పష్టం చేసింది.

AI వల్ల ముప్పు.....
కంపెనీ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలతో కలిసి AI రంగంలో పెట్టుబడులు పెంచుతోంది. కొత్త టెక్నాలజీని వాడుకుంటున్న మాట వాస్తవమే అయినా, దాని వల్ల ఉద్యోగాలకు ముప్పు వస్తుందనే వార్తలు మాత్రం అవాస్తవమని కంపెనీ యాజమాన్యం భరోసా ఇచ్చింది.