- రూ.593 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయం
- పీఎంజేవీకే కింద ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ కమిషనరేట్ ప్రపోజల్స్
- మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల రూపురేఖలు మారనున్నాయి. దశల వారీగా వాటిని డెవలప్ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని 24 సర్కారు కాలేజీలకు కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం(పీఎంజేవీకే) కింద వీటిని కట్టేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.593.70 కోట్ల అంచనాతో ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తాజాగా సర్కారుకు ప్రపోజల్స్ పంపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో..
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల పరిధిలోని 24 కాలేజీలకు కొత్త భవనాలు కట్టాలని ప్రపోజల్స్ పంపించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 593.70 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.355.62 కోట్ల(60 శాతం) నిధులను ప్రతిపాదించింది. మిగిలిన రూ. 237.10 కోట్లు(40 శాతం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీజీఈడబ్ల్యూఐడీసీ) అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవన నిర్మాణాల అంచనాలను సిద్ధం చేశారు.
ప్రస్తుతం సర్కారు కాలేజీల్లో ఉచిత అడ్మిషన్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ల్యాబ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పలు కార్యక్రమాల నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలో అడిషనల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల అవసరం ఏర్పడింది. దీంతో మైనారిటీ స్టూడెంట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కాలేజీలను ఈ పథకం కింద ఎంపిక చేశారు.
కొత్త భవనాలు రానున్న కాలేజీలు ఇవే..
తొలుత హైదరాబాద్ జిల్లాలోని కాలేజీలకే కొత్త బిల్డింగ్లు కట్టాలని ఇంటర్మీడియట్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే, ఉన్నతాధికారుల సూచనతో రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న కాలేజీలను ఎంపిక చేస్తూ మరో ప్రపోజల్ సర్కారుకు అందించారు. హైదరాబాద్ లో 11 కాలేజీలు ఉండగా, నాంపల్లి కాలేజీకి రూ.40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టాలని ప్రతిపాదించారు. నగరంలోని ఫలక్ నుమా, గోల్కొండ, బోరుబండ, ముషీరాబాద్, హుస్సేనీ ఆలం, మారెడుపల్లి, సిటీ కాలేజీ, మైసారం, కాచిగూడ తదితర కాలేజీలున్నాయి.
వీటితో పాటు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి కాలేజీలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు, రాంచంద్రపురం కాలేజీలు, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, బీహెచ్ఈఎల్ కాలేజీలు ఉన్నాయి. నిర్మల్ లోని భైంసా, ముథోల్, నల్గొండ గర్ల్స్, ఆదిలాబాద్ బాయ్స్, మహబూబ్ నగర్ గర్ల్స్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. వీటి ద్వారా 25 వేల మందికి పైగా విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
