అంతర్జాతీయంగా ముదిరిన పరిస్థితులతో పెరిగిన గ్యాస్ ధరలు ఇప్పుడు సామాన్యుడి వంటింటినే కాక.. స్మశానవాటికలను కూడా వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన LPG కొరత వింతైన, విచారకరమైన పరిస్థితులకు దారితీస్తోంది. మహారాష్ట్రలోనే అతిపెద్ద స్మశానవాటికగా పేరుగాంచిన పుణేలోని 'వైకుంఠ ధామ్'లో గ్యాస్ తో నడితే దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బతికి ఉన్నప్పుడు గ్యాస్ ధరల సెగను అనుభవించిన సామాన్యుడికి, చనిపోయిన తర్వాత కూడా అదే గ్యాస్ కొరత కారణంగా అంతిమ యాత్రలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. వైకుంఠ ధామ్ స్మశానవాటికలో ఉన్న మూడు గ్యాస్ ఫర్నేస్‌లు ఎల్‌పీజీ కొరతతో ప్రస్తుతం మూతపడ్డాయి. సాధారణంగా ఇక్కడ రోజుకు 20 వరకు అంతిమ సంస్కారాలు జరుగుతుంటాయి. ఒక్కో మృతదేహాన్ని దహనం చేయడానికి సుమారు 18 కిలోల ఎల్పీజీ అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం రెండు గ్యాస్ ఫర్నేస్‌లకు సరిపడా గ్యాస్ మాత్రమే నిల్వ ఉండటంతో అధికారులు గ్యాస్ ద్వారా దహన సంస్కారాలను నిలిపివేశారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులే. యుద్ధం కారణంగా దిగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున.. వాణిజ్య అవసరాల కంటే గృహ వినియోగదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువులను ముందుగా ఇళ్లకే సరఫరా చేయాలని మార్చి 5న ఆదేశాలు వెలువడ్డాయి. దీనివల్ల వైకుంఠ ధామ్ వంటి భారీ సంస్థలకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని హామీ ఇస్తున్నప్పటికీ.. ప్రాధాన్యత క్రమంలో మార్పులు రావడం ఇలాంటి ఇబ్బందులకు కారణంగా మారింది
ప్రస్తుతానికి పుణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయంగా విద్యుత్ దహన వాటికలను, కట్టెలతో సంప్రదాయ పద్ధతులను మరణించిన వారి అంతిమ సంస్కారాలు చేయటానికి వాడుతోంది. గ్యాస్ కొరత తీరే వరకు ఇక్కడికి వచ్చే మృతదేహాలకు విద్యుత్ ఫర్నేస్‌ల ద్వారానే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. యుద్ధం తెచ్చిన చమురు సంక్షోభం మనిషి జీవన ప్రయాణాన్నే కాదు, చివరి ప్రయాణాన్ని కూడా ఎంతలా ప్రభావితం చేస్తోందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
