- మల్లన్నను దర్శించుకున్న 40 వేల మంది
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం సుమారు 40 వేల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచే భక్తులు మల్లన్న క్షేత్రానికి బాటపట్టారు. ఆదివారం వేకువజాము నుంచే తలనీలాలు సమర్పించి, మల్లన్న పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి, గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
మట్టికుండల్లో బోనం తయారు చేసి మల్లన్న స్వామితో పాటు కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మ, పోచమ్మ దేవతలకు సమర్పించారు. అనంతరం రాతి గీరల వద్ద ప్రదక్షిణలు చేసి కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.
