కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‎తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‎తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 22) సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‏తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్‎లో జరుగుతోన్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ టేకోవర్, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్‎సీ పెండింగ్ నిధులు గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతోన్న వేళ ఈ భేటీకి ప్రాధ్యానత సంతరించుకుంది. 

రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి:

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించుకుంటున్నారు. కిషన్ రెడ్డి వల్లే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించగా.. తన వల్ల తెలంగాణకు రావాల్సిన ఏ ప్రాజెక్ట్ ఆగిపోలేదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

అయితే, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 2 అనుమతులు, పెండింగ్ నిధులపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‎తో మీటింగ్ అరేంజ్ చేయాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు. సీఎం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి.. సోమవారం (జూన్ 22) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‎తో మీటింగ్ సెట్ చేశారు. ఈ సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఒకే గదిలో కూర్చొని చర్చించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారింది.