- జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 3,160 కేసుల పరిష్కారం
- రాష్ట్రంలో తొలి ఐదు స్థానాల్లో మెదక్ జిల్లా
- ఎస్పీ డీవీ శ్రీనివాసరావ్ వెల్లడి
మెదక్, వెలుగు: జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులను రాజీ ద్వారా పరిష్కరించి మెదక్ జిల్లా రాష్ట్రంలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన రాజీకి అవకాశం ఉన్న 925 ఐపీసీ/బీఎన్‌ఎస్‌ఎస్/ఎస్‌ఎల్‌ఎల్ కేసుల్లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు చెప్పారు. 343 ఈ-పెట్టీ కేసులు, 1,892 డీడీ కేసుల్లో అడ్మిషన్, జరిమానా ప్రక్రియ పూర్తయిందన్నారు.
మొత్తంగా 3,160 కేసులు జాతీయ మెగా లోక్‌అదాలత్ ద్వారా పరిష్కారమైనట్లు వెల్లడించారు. సైబర్ నేరాల బాధితులకు కూడా త్వరగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 41 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.23,52,838, ఎఫ్‌ఐఆర్ నమోదు కాని 41 ఫిర్యాదుల్లో రూ.3,39,000 బాధితులకు తిరిగి అందించేందుకు కోర్టు అనుమతి లభించినట్లు చెప్పారు.
మొత్తంగా రూ.26,91,838 బాధితులకు తిరిగి అందనున్నట్లు వెల్లడించారు. క్షణికావేశంలో జరిగే వివాదాలను శాశ్వత శత్రుత్వాలుగా మార్చుకోవద్దని సూచించారు. కేసుల్లో ఇరు వర్గాలు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి వివాదాలను పరిష్కరించుకోవాలన్నారు.
