శ్రమను గుర్తించడమే మహిళలకిచ్చే గౌరవం..టీజేఎస్ చీఫ్  ప్రొఫెసర్ కోదండరాం

శ్రమను గుర్తించడమే మహిళలకిచ్చే గౌరవం..టీజేఎస్ చీఫ్  ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: సమాజంలో మహిళల శ్రమను గుర్తించడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్​లోని అడిక్‌‌మెట్ డివిజన్ రాంనగర్ గుండు వద్ద మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పించినప్పుడే అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటా బయట మహిళలు వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

మహిళలు ఇంట్లో చేసే పనుల నుంచి కార్యాలయాల్లో చేసే పనుల వరకు గుర్తింపు ఇస్తూ వారికి సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ ఇమామ్ సహకారంతో చీరలు పంపిణీ చేశారు. వారితో కలిసి కోదండరాం కేక్​ కట్​ చేశారు.

ఈ కార్యక్రమంలో టీజేఎస్​ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్, నాయకులు పుష్పలీల, రాణి జైపాల్ రెడ్డి, జస్వంత్, రామచందర్ తదితరులు హాజరయ్యారు.