హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి బాధితుల ఇండ్లకే వచ్చి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలతో పాటు సున్నితమైన కేసుల్లో బాధితులకు మానవీయంగా సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేసుల్లో బాధితులైన మహిళలు, చిన్నారులు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే, వారి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా మంగళవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌లో భాగంగా ఈ విప్లవాత్మక మార్పు చేపట్టినట్లు తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాల నిషేధ చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఈ విధానం అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. నేరం జరిగిన వెంటనే బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే, సంబంధిత పోలీస్ అధికారి బాధితుడి నివాసానికి, సంఘటన స్థలానికి లేదా బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని ఫిర్యాదు స్వీకరిస్తారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దాని ప్రతిని బాధితులకు వారి ఇంటి వద్దే అందజేస్తారు.
జీరో ఎఫ్‌ఐఆర్ సహా కేసులు నమోదు
బాధితుల నుంచి సమాచారం అంగానే ‘జీరో ఎఫ్‌ఐఆర్’ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాలని అధికారులకు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా ఆదేశాలిచ్చారు. ఈ విధానంతో దర్యాప్తులో జాప్యం తగ్గి, సాక్ష్యాలు తారుమారు కాకుండా రక్షించవచ్చని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లు, యూనిట్లు ఈ నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ)ను అమలు చేయాలని ఆదేశించారు.
