T20 World Cup 2026: ఇండియాలో వరల్డ్ కప్ ఆడం.. ఐసీసీ ఒత్తిడికి ఆలోచన మార్చుకోము: బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్

T20 World Cup 2026: ఇండియాలో వరల్డ్ కప్ ఆడం.. ఐసీసీ ఒత్తిడికి ఆలోచన మార్చుకోము: బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఆడే సూచనలు కనిపించడం లేదు. భద్రతా కారణాలు చూపిస్తూ ఇండియాలో అడుగు పెట్టమని ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చాలా సార్లు చెప్పింది. అయితే ఐసీసీ బంగ్లాదేశ్ కు మరోసారి ఆలోచించుకోమని అవకాశం ఇచ్చింది. బుధవారం (జనవరి 21) లోపు తమ సమాధానాన్ని చెప్పాల్సిందిగా డెడ్ లైన్ విధించింది. ఈ డెడ్ లైన్ విధించిన మాత్రానా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం (జనవరి 20) ఖరాఖండిగా చెప్పారు. 

వరల్డ్ కప్ లో తమ స్థానాన్ని వేరే జట్టుతో రీప్లేస్ చేస్తారనే  బెదిరింపు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ జట్టు ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడమని నజ్రుల్ స్పష్టంగా చెప్పారు. నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.."భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి ఐసీసీకి తలొంచి మాపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంది. షరతులు విధించడం ద్వారా మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము ఆ షరతులను అంగీకరించము". అని నజ్రుల్ అన్నారు. ఐసీసీ విధించిన గడువుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉండడంతో నజ్రుల్ తమ నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పుకొచ్చాడు.

 ఒకవేళ ఇండియా రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే టోర్నమెంట్ నుంచి తొలగించబడుతుంది. బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టు వరల్డ్ కప్ ఆడుతుంది. ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్ స్థానంలో ఆడనుంది. భద్రతా సమస్యల వల్లే ఇండియాలో పర్యటించేందుకు తాము వెనకడుగు వేస్తున్నామని బంగ్లాదేశ్ బోర్డు ఇప్పటికే చాలాసార్లు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. సాధ్యమైన పరిష్కారం కోసం మరోసారి ఐసీసీతో చర్చలు జరుపుతామని తెలిపింది. ఒక పక్క ఐసీసీ బంగ్లాదేశ్ భద్రతకు హామీ ఇచ్చినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఇండియా రావడానికి సిద్ధంగా లేదు.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.