మెల్‌బోర్న్: ఇటలీ స్టార్ ప్లేయర్ జానిక్ సినర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండోసీడ్ సినర్ 6–2, 6–1 స్కోరుతో ఉన్న దశలో హుగో గాస్టన్ (ఫ్రాన్స్) గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దాంతో వాకోవర్ విజయంతో సినర్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గంటా 8 నిమిషాల మ్యాచ్‌లో సినర్ మూడు గేమ్స్ మాత్రమే కోల్పోయాడు. 6 ఏస్‌లు, 19 విన్నర్లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో 86 శాతం పాయింట్లు సాధించాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ముసెట్టి (ఇటలీ) 4–6, 7–6 (7/3), 7–5, 3–2తో రాఫెల్ కొలిగ్నన్ (బెల్జియం)పై, షెల్టన్ (అమెరికా) 6–3, 7–6 (7/2), 7–6 (7/5)తో ఉగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై, టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/5), 5–7, 6–1, 6–3తో వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై, కరెన్ కచనోవ్ (రష్యా) 4–6, 6–4, 6–3, 5–7, 6–3తో అలెక్స్ మిచెల్సెన్ (అమెరికా)పై గెలవగా, మోన్‌ఫీల్స్ (ఫ్రాన్స్) 7–6 (7/3), 5–7, 4–6, 5–7తో క్వాలిఫయర్ స్వీని (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఎలెనా రిబకిన (కజికిస్తాన్) 6–4, 6–3తో కాజా జువాన్ (స్లోవేనియా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (8/6), 6–1తో ఒలెక్సాండ్రా ఒలినికోవా (ఉక్రెయిన్)పై, నవోమి ఒసాకా (జపాన్) 6–3, 3–6, 6–4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై, బెనిసిచ్ (కెనడా) 6–0, 7–5తో క్యాటీ బౌల్డర్ (బ్రిటన్)పై నెగ్గి ముందంజ వేశారు. మెన్స్ డబుల్స్‌లో ఇండియాకు చెందిన నికీ పూనాచా–ప్రుచాయా ఇసారో (థాయ్‌లాండ్) 6–7 (3/7), 5–7తో పెడ్రో మార్టినేజ్–జూమీ మునార్ (స్పెయిన్) చేతిలో ఓడారు.
