ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్ లోకే

 ఏప్రిల్ నుంచి  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్ లోకే
  • .. శాలరీ కష్టాలకు ఇక చెల్లు
  • ఐఎఫ్​ఎంఎస్​లో ప్రత్యేక ఆప్షన్  లేదా ప్రత్యేక పోర్టల్.. కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ
  • ఇప్పటికే శాఖలవారీగా ఆధార్, బ్యాంకు అకౌంట్లతో లింక్​
  • ఇన్నాళ్లూ హెచ్​వోడీ, ఏజెన్సీల అకౌంట్లలో జమ.. దీంతో అడ్డగోలు అక్రమాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల దాకా కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కారు చెక్​ పెట్టబోతోంది.  ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది.  ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్​ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్​ ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​) విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తోంది. కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్​ఎంఎస్​లోనే ప్రత్యేక ఆప్షన్​ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడమా.. లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్​పోర్టల్​ రెడీ చేయడమా? అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల జీతాలను వారి హెచ్​వోడీలు, లేదంటే ఏజెన్సీలకే సర్కారు జమచేస్తోంది. దీని వల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతోపాటు  భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పుతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికే అందనుంది. అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్​ డిపార్ట్​మెంట్​, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. 

ఏజెన్సీల దోపిడీ.. బినామీల దందాకు బ్రేక్

ప్రభుత్వం వద్ద ఉన్న పాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 4.93 లక్షలుగా ఉంది . కానీ  ప్రతి ఒక్కరి వివరాలను ఆధార్‌‌‌‌‌‌‌‌తో అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలని, అలాగైతేనే ఈ నెల జీతాలు ఇస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్య గతంలో అనుకున్న దానికంటే  కాస్త పెరిగి, ప్రస్తుతం 5 లక్షలు దాటింది. కొత్తగా గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ ఉద్యోగుల వివరాలు చేర్చడంతో ఈ సంఖ్య పెరిగింది.  ఇన్నాళ్లూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లూ బయటపడింది.   ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాల కోసం నిధులు విడుదలైనప్పటికీ, చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కొన్ని విభాగాల్లో అయితే అసలు లేని ఉద్యోగుల పేర్లతో బినామీలను సృష్టించి  అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నేరుగా శాలరీ బదిలీ  విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉండడంతోపాటు కిందిస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనం అందనుంది.

సామాజిక భద్రతకు   భరోసా

 మినిమం స్కేల్  పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్​ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్​ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతి నెలా  వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి పోనుంది. జీతాలు నేరుగా పడటం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా, ఉద్యోగుల సామాజిక భద్రతకు కూడా గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా, ఇకపై ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుండటంతో ప్రతి ఉద్యోగికి అందాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వాటాలు కూడా సక్రమంగా జమ అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ప్రమాద బీమా లేదా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఉద్యోగుల వివరాల డిజిటలైజేషన్​..

ఈ విధానంలో భాగంగా డిపార్ట్​మెంట్ల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తోంది. పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్,  బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందికి తెస్తోంది. గతంలో ఏ ఉద్యోగి, ఎక్కడ పనిచేస్తున్నారో, వారికి ఎంత జీతం అందుతుందో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పటిష్టమైన డిజిటల్ డేటాబేస్ సిద్ధం కావడంతో, ఒక్క క్లిక్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోని ఏ మూలన ఉన్న ఉద్యోగి వివరాలైనా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఆధార్ లింకింగ్ వల్ల ఒకే వ్యక్తి రెండు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు చూపి జీతాలు పొందడం లేదా ఒకే పేరుతో రెండు అకౌంట్లకు నిధులు మళ్లించడం వంటి మోసాలకు జరగకుండా చూడనుంది.