హైదరాబాద్ లో మూతపడ్డ బిస్కెట్ల కంపెనీ.. రోడ్డున పడ్డ 300 మంది ఉద్యోగులు..

హైదరాబాద్ లో మూతపడ్డ బిస్కెట్ల కంపెనీ.. రోడ్డున పడ్డ 300 మంది ఉద్యోగులు..

హైదరాబాద్ లో బిస్కెట్ల తయారీ కంపెనీ ముఆటపడటంతో 300 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. హైదరాబాద్ లోని ఆదిభట్లలో ఉన్న నర్మదా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నఫలంగా మూతపడటంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు. 45 రోజుల కిందట మూతపడ్డ సంస్థ ఇప్పటికీ జీతాలు కూడా సెటిల్ చేయకపోవడంతో ఆందోళన చేపట్టారు ఉద్యోగులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పార్లే బిస్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కొన్ని రకాల బిస్కెట్లు, ఇతర ప్రోడక్టులు తయారు చేస్తున్న నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009లో హైదరాబాద్ లోని నాచారంలో నెలకొల్పారు. 

2018లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ కు కంపెనీని మార్చారు. కంపెనీలో సుమారు 300 మంది పనిచేస్తుండగా అందులో 260 మంది కాంట్రాక్టు వర్కర్లు, మిగతా 40 మంది ఉద్యోగులుగా పనిచేసేవారు. 2025 డిసెంబర్ 1 న నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పర్లే బిస్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో బొంగ్లూర్ లోని నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూసేశారు. దీంతో సంస్థలో పని చేస్తున్న 300 మంది రోడ్డున పడ్డారు.

18 ఏండ్ల నుండి పని చేస్తున్న తమకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా కంపెనీని మూసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. జీతాలు కూడా సెటిల్ చేయకపోవడంతో గత 45 రోజులుగా కంపెనీ దగ్గరికి వచ్చి వెళ్తున్నామని... జీతాల విషయం అడిగితే కాలయాపన చేస్తున్నారని అంటున్నారు ఉద్యోగులు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కంపెనీని మూసివేయడంతో తాము, తమ కుటుంబాలు రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు హెల్పర్స్, ఇంఛార్జీలు, సూపర్వైజర్లు, ఆపరేటర్లు, వర్కర్లు, లైన్ కట్టర్లు డిమాండ్ చేస్తు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.