ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను చుట్టుముట్టిన వేళ.. సంపన్నులు తమ ఆస్తుల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దుబాయ్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగిన తర్వాత.. అక్కడ స్థిరపడిన భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు.. ఇతర ఆసియా దేశాల ధనవంతులు కూడా తమ డబ్బును సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ 'సేఫ్ హెవెన్'గా ఫేమస్ అయిన దుబాయ్ ప్రతిష్ఠ ఇరాన్ బాంబు దాడులతో మసకబారుతుండటంతో పెట్టుబడిదారులు సింగపూర్, హాంకాంగ్ వైపు తరలిపోతున్నారని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
దుబాయ్‌లో నివసిస్తున్న ఇద్దరు భారతీయ పారిశ్రామికవేత్తలు రిస్క్ తగ్గించుకోవడానికి తమ బ్యాంకు ఖాతాల నుండి ఒక్కొక్కరు లక్ష డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సింగపూర్‌కు తరలించడానికి ప్రయత్నించినట్లు రాయిటర్స్ కథనం ప్రచురించింది. ఇరాన్ దాడులతో ఏర్పడిన టెక్నికల్ ఇబ్బందుల వల్ల మొదట్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ.. ఆ తర్వాత ఇతర బ్యాంకుల ద్వారా వారు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయగలిగారు. వీరే కాకుండా.. చాలా మంది సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను గల్ఫ్ నుండి తరలించేందుకు న్యాయ నిపుణులను, ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది సంపన్న వర్గాల్లో.
కనీసం 50 మిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన దుబాయ్ క్లయింట్లు చాలామంది వెంటనే తమ డబ్బులను సింగపూర్‌కు మార్చాలని ప్లాన్ చేస్తున్నారని.. సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ వెల్త్ లాయర్ ర్యాన్ లిన్ తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కారణంగా ఫ్యామిలీ ఆఫీసులు కూడా అప్రమత్తమయ్యాయి. ఇన్నాళ్లూ కేవలం పన్ను ప్రయోజనాల కోసమే దుబాయ్‌ను ఎంచుకున్న వారు.. ఇప్పుడు పన్నుల కంటే తమ ప్రాణాలకు, ఆస్తులకు భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. ఒకవేళ యుద్ధం రేపు ముగిసినా.. విమానాల రాకపోకలు, భద్రతపై నమ్మకం కలగడం అంత ఈజీ వ్యవహారం కాదని నిపుణులు అంటున్నారు.
ALSO READ : ఇరాన్‌పై దాడి, 12 గంటల్లోనే 900 మిస్సైల్స్..
అయితే అందరూ ఇదే అభిప్రాయంతో ఏకీభవించటం లేదు కూడా. కొందరు వెల్త్ మేనేజర్లు మాత్రం పెట్టుబడిదారులు యూఏఈ దీర్ఘకాలిక వృద్ధిపై నమ్మకంతో ఉన్నారని, భారీ స్థాయిలో నిధుల తరలింపు ఇంకా మొదలు కాలేదని చెబుతున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖాలీద్ మహమ్మద్ బలామా కూడా తమ బ్యాంకింగ్ రంగం బలంగా ఉందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు సాగుతున్నాయని భరోసా ఇచ్చారు. యుద్ధం నేరుగా యూఏఈని చుట్టుముట్టనంత వరకు తమ వ్యాపార ప్రణాళికల్లో మార్పు ఉండదని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధ భయం మాత్రం సంపన్నులను సింగపూర్ వంటి దేశాల వైపు పరుగులు పెట్టిస్తోంది.
