15 ఏళ్లుగా సెలవులో ఉన్న టెక్కీ.. జీతం పెంచలేదంటూ కేసు

15 ఏళ్లుగా సెలవులో ఉన్న టెక్కీ.. జీతం పెంచలేదంటూ కేసు

పనిచేయకుండానే ఏటా లక్షల రూపాయల జీతం.. అది కూడా ఏకంగా 15 ఏళ్ల నుంచి సెలవులో ఉంటూనే. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇది నిజంగా జరిగిన కథ. ఐటీ దిగ్గజం IBM సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్‌ చేసిన పని గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతోంది. 

యూకేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇయాన్ క్లిఫోర్డ్, అనారోగ్య కారణాల వల్ల 2008లో సెలవుపై వెళ్లారు. ఆయన పరిస్థితిని గమనించిన ఐబీఎమ్.. 2013లో ఒక భారీ సెటిల్మెంట్ చేసుకుంది. కంపెనీ 'డిసెబిలిటీ ప్లాన్' ప్రకారం.. ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు, పని చేయకపోయినా ప్రతి ఏటా ఆయన చివరి జీతంలో 75% చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆయనకు ఏడాదికి సుమారు 54వేల యూరోలు అంటే మన భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.55 లక్షలు అందుతున్నాయి. రిటైర్మెంట్ వరకు ఆయనకు దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా జీతం రూపంలో అందుకుంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా అసలు వివాదం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. 

 ఇంతటి భారీ ప్రయోజనం పొందుతున్నా.. క్లిఫోర్డ్ 2022లో ఐబీఎమ్ కంపెనీపై కోర్టులో కేసు వేశారు. తన జీతం గత పదేళ్లుగా పెరగలేదని, ద్రవ్యోల్బణం వల్ల తన ఆదాయం విలువ తగ్గిపోతోందని వాదించారు. తనకు 'ఇన్‌క్రిమెంట్లు' ఇవ్వకపోవడం వికలాంగుల పట్ల వివక్ష చూపడమేనని కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ క్లిఫోర్డ్ వాదనను తోసిపుచ్చింది. అసలు పనిచేయకుండానే 75% జీతం పొందడం అనేది ఒక అసాధారణ ప్రయోజనం అంటూ కోర్టు సదరు ఉద్యోగికి మెుట్టికాయలు వేసింది. సాధారణ ఉద్యోగులకు లేని ఒక ప్రత్యేక సదుపాయాన్ని పొందుతున్నప్పుడు, అది 'వివక్ష' ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది.ద్రవ్యోల్బణం అందరినీ ప్రభావితం చేస్తుందని.. కానీ పని చేయని వ్యక్తికి కూడా జీతం పెంచాలని కోరడం సమంజసం కాదని కోర్టు వెల్లడించింది.

భారత ఐటీ రంగంలో ఏడాదికోసారి వచ్చే అప్రైజల్స్ కోసం ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అలాంటిది ఏళ్ల తరబడి పని చేయకుండానే కోట్లాది రూపాయల జీతం పొందుతూ.. మళ్లీ ఇన్‌క్రిమెంట్ల కోసం కోర్టుకు వెళ్లడం నిజంగానే అందరినీ షాక్ కి గురిచేస్తోంది. హక్కులకు, బాధ్యతలకు మధ్య ఉన్న సన్నని గీతను ఉద్యోగులు తెలుసుకోవాలని తాజా టెక్కీ స్టోరీ నిరూపిస్తోంది.